Revanthreddy on TSPSC Paper Leakage: రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు విద్యార్థి సంఘాలు నిరసనలతో హోరెత్తిస్తుంటే... మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలతో ముంచెత్తుతున్నాయి. కాంగ్రెస్ తనదైన శైలిలో టీఎస్‌పీస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సర్కార్‌పై పదునైన ఆరోపణలతో మండిపడుతుంటే.. బీజేపీ తన దూకుడుని ప్రదర్శిస్తుంది.
తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోసారి పేపర్ లీకేజీ వ్యవహారంపై కేసీఆర్ సర్కార్‌పై తనదైన శైలిలో ఆరోపణలు గుప్పిస్తూ విరుచుకుపడ్డారు. నిజామాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రను ముగించుకుని 32వ రోజు కామారెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టిన రేవంత్.. రాజంపేట వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు సంధిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డారు.
'కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడు.కేసీఆర్‌పై హత్యనేరం కింద కేసు పెట్టాలి. నవీన్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అవకాశం ఇచ్చారు. నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదు.'- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
పేపర్ లీకేజీపై ఈనెల 22న గవర్నర్‌ను కలుస్తాం : రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నపత్రాలు అందుతున్నాయన్న రేవంత్.. పేపర్ లీకేజీ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేసేస్తున్నారని ఆరోపించారు. పరీక్ష పేపర్ లీకేజ్‌కు కారణం.. కేటీఆర్ అన్నారు. కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరు అని రేవంత్ ప్రశ్నించారు. పేపర్ లీకేజీపై ఈనెల 22న గవర్నర్‌ను కలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
'పేపర్ లీకేజ్‌కు కారణం కేటీఆర్.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ ఎందుకు చేయరు?' 'నోటికొచ్చిన అబద్దాలతో గద్దెనెక్కిన కేసీఆర్ ప్రజల గుండెలపై తంతున్నారు. 30లక్షల మంది నిరుద్యోగులు టీఎస్‌పీఎస్సీలో నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నా నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదు. నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ పోరాడితే 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఎంసెట్, ఏఈ, సింగరేణి, విద్యుత్ శాఖ, గ్రూప్-1 పేపర్లు లీక్ అయ్యాయి. బిడ్డ కోసం మంత్రులను దిల్లీకి పంపించిన కేసీఆర్...పేపర్ లీకేజీపై ఎందుకు సమిక్షించలేదు ?.'-రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు : ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కు ఏమిటో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. నిరుద్యోగుల జీవితాలు ఆగమైతుంటే గవర్నర్ ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్సీ సభ్యులను రాజీనామా చేయించి.. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: