Revanth Reddy : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ 'మన ఊరు- మన పోరు' బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. చెరకు ఫ్యాక్టరీలు తెరుస్తామని హామీ ఇచ్చిన కవిత... ఎంపీగా గెలవగానే ఆ విషయాన్ని మర్చిపోయారని రేవంత్ విమర్శించారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్‌పేపర్‌పై రాసిచ్చిన భాజపా ఎంపీ అర్వింద్ హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. పసుపు బోర్డు రాక పసుపు రైతులు, గిట్టుబాటు ధర లేక ఎర్రజొన్న రైతులు, వరి వేయొద్దన్న కేసీఆర్ ప్రకటనలతో నిజామాబాద్ జిల్లా పడావుగా మారే పరిస్థితి ఉందని ఆరోపించారు. 2లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో 10వేల కోట్లు పెట్టి అన్నదాతలు పండించిన ధాన్యాన్ని కొనలేరా? అని ప్రశ్నించారు. నెపాన్ని కేంద్రంపై నెట్టి మరోసారి దిల్లీపై అగ్గిపుట్టిస్తానని బయలుదేరుతున్నారని మండిపడ్డారు.
మరి రైతులు ఏమవ్వాలి..
'వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడిబజార్లో ఉరితీస్తాం. ఇక్కడ రైతులను చూస్తే పంజాబ్, హరియాణా రైతుల్లాగా పోరాట స్ఫూర్తి కనిపిస్తోంది. మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే పంజాబ్, హరియాణా రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను బొంద పెట్టారు. కేసీఆర్ ముద్దుల కూతురు కవిత ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నది. కానీ 1500 రోజులు అయిన తెరవకపోవడంతో ఆమెను ఎలా ఓడించారో..మీకే తెలుసు. అర్వింద్ ఇలాగే పసుపు బోర్డు తెస్తా అన్నాడు అడ్రెస్ లేదు.. ఆయన మోసం చేశాడు. ఎర్ర జొన్నలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తా అని కేసీఆర్ మోసం చేశారు. ఇప్పుడు కేసీఆర్ వరి వేయొద్దు అంటున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాల భూమికి నీళ్లు ఇస్తా అంటున్నావు. మరి నీళ్లు, ఉచిత కరెంట్ ఇచ్చి ఏమి పండించమంటున్నావు కేసీఆర్. రైతులు పండించిన పంటలను కొనమంటే మరి రైతులు ఏమవ్వాలి. రూ.10 వేల కోట్లు కేటాయిస్తే మొత్తం ధాన్యం కొనవచ్చు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే. రాష్ట్రంలోని 7,500 ఐకేపీ కేంద్రాలు తెరవాలి. రైతుల పంటలు కొనకుంటే కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడిస్తాం.' -రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు