kodandaram on kcr in kamareddy:దిల్లీ వెళ్లి వచ్చాక వరిసాగుపై స్పష్టత ఇస్తామన్న కేసీఆర్.. వచ్చాక ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. దిల్లీ నుంచి వచ్చి ఫాంహౌస్‌లోకి వెళ్లిన సీఎం.. రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కోదండరాం ఇవాళ సందర్శించారు. లింగంపేట్, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, గాంధారి, సదాశివనగర్, కామారెడ్డి మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. కోదండరాం విమర్శించారు.
'పొద్దుట నుంచి తిరిగినాక.. అనుమానాలు పెరిగినాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో కొనుగోళ్లు పూర్తికాలేదు. రైతుల నుంచి ధాన్యం సేకరించి.. అనంతరం మిల్లులకు తరలించొచ్చు.. అలాకాకుండా మిల్లులకు తరలించేదాక.. రైతుల నెత్తిన బాధ్యత పెట్టి.. నానా ఇబ్బందులు పెడుతున్నారు. కేసీఆర్ దిల్లీకి పోయివచ్చినాక యాసింగిలో ఏం పంట వేయాలో చెబుతానన్నారు.. ఇంకా ఏం చెబుతాలేరేంటి అని.. ఎక్కడికి పోయినా రైతులు అడుగుతున్నారు. దిల్లీ నుంచి వచ్చి ఫాంహౌస్‌కు పోయారు. రైతులకు ఏం పండించాలో అర్థం కావడం లేదు. కేసీఆర్ వెంటనే బయటకి వచ్చి రైతులు ఏం చేయాలో మార్గనిర్దేశం చేయాలి.'