కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఓ భూవివాదం విషయంలో కుల పెద్దలు మూడు కుటుంబాలను బహిష్కరించారు. అకిటి రవీందర్ రెడ్డి, గుట్టకాడి రామ్‌రెడ్డి, అకిటి శ్రీకాంత్ రెడ్డిల కుటుంబాలను కుల పెద్దలు బహిష్కరించారు. ఈ కుటుంబాలతో ఎవరు మాట్లాడినా, మంచి చెడులకు వెళ్లినా రూ. 10 వేలు జరిమానా విధిస్తామని కుల పెద్దలు తీర్మానం చేశారు. ఈ విషయంపై బాధితుడు రవీందర్ రెడ్డి స్థానిక తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు.
కబ్జాకు యత్నం
తాడ్వాయి గ్రామానికి చెందిన రామ్‌రెడ్డి, సావిత్రిలు భార్యాభర్తలు. వీరికి సరిత, స్వాతి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారి పెళ్లిళ్లు అయ్యాయి. దంపతులకు అబ్బాయిలు లేకపోవడంతో ఇంటి పెద్దల్లుడు అకిటి రవీందర్ రెడ్డి.. ఇల్లరికం వెళ్లాడు. వీరికి సుమారు 19 ఎకరాల భూమి ఉండటంతో రవీందర్ రెడ్డి సాగుచేస్తూ అత్తామామలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే ఆ భూమిలో ఎకరం 30 గుంటలు తమదంటూ తమ బంధువులైన గుట్టకాడి మణెమ్మ కుమారులు స్వామి, సంజీవరెడ్డి, రంజిత్ రెడ్డి.. ఆ పొలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 8 నెలల క్రితం అకిటి రవీందర్ రెడ్డితో పాటు సావిత్రిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. దీంతో రవీందర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మా కుటుంబం, చిన్నమామ కుమారులు అందరూ ఆస్తులు పంచుకున్నారు. ఇప్పుడు నా పేరు మీద ఉన్న భూమిని పట్టా చేయాలని వేధిస్తున్నారు. సంతకం పెట్టమన్నారు. లక్ష రూపాయల జరిమానా కట్టమంటే కడతాం అన్నాం. కానీ ఇప్పుడు మా మీద దాడులకు పాల్పడుతున్నారు. -సావిత్రి, బాధితురాలు
మా అత్తమామలకు మగపిల్లలు లేకపోవడంతో నేను ఇల్లరికం వచ్చాను. ఎకరం 30 గుంటలు పట్టా చేయాలని మా బంధువులు వేధిస్తుంటే కుల పెద్దలను ఆశ్రయించాం. వారు రిజిస్ట్రేషన్ లేదా రూ. లక్ష కట్టమన్నారు. డబ్బు కట్టడానికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు మళ్లీ మమ్మల్ని కుల బహిష్కరణ చేశారు. ఎవరూ మాతో మాట్లాడటం లేదు. అందుకే న్యాయం చేయాలని తహసీల్దార్‌ను ఆశ్రయించాం. -రవీందర్ రెడ్డి, బాధితుడు