తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారుల పొరపాటు.. ఆ ఊరికి గ్రహపాటు

రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాలేవీ ఆ ఊర్లో అందడం లేదు. రైతులకు పెట్టుబడి సాయం దక్కడం లేదు. రైతు ప్రమాదవశాత్తు మరణించినా బీమా సొమ్ము రావడం లేదు. కామారెడ్డి జిల్లాలోని వెంకటాపూర్‌-అగ్రహార్‌ గ్రామస్థుల దీనావస్థ ఇది.

By

Published : Mar 27, 2022, 12:14 PM IST

Venkatapur-Agrahar village
వెంకటాపూర్‌-అగ్రహార్‌ గ్రామం

భూ దస్త్రాల ప్రక్షాళన సమయంలో దేవాదాయ, రెవెన్యూ అధికారులు చేసిన పొరపాటు అక్కడి రైతులకు పాలిట శాపంగా మారింది. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను దేవాదాయశాఖవి వారు పేర్కొన్నారు. దీంతో డిజిటల్‌ పట్టా పాసుపుస్తకాలు అందక ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.

కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో వెంకటాపూర్‌-అగ్రహార్‌ గ్రామం ఉంది. ఇక్కడున్న 225 మంది సన్న, చిన్నకారు రైతులు 180 ఎకరాల మేర భూమిని సాగు చేసుకుంటున్నారు. మరో 50 ఎకరాల్లో గ్రామం నెలకొంది. భూ దస్త్రాల ప్రక్షాళనకు పూర్వం వారి భూములకు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. వాటిపై బ్యాంకుల్లో రుణాలూ తీసుకునేవారు.

ఐదు ఎకరాలకు బదులు మొత్తం చేర్చారు

ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయానికి చెందిన ఐదు ఎకరాల భూమి ఈ గ్రామంలో ఉంది. ఇది మినహా మిగిలిన భూములన్నీ పట్టాలున్నవే. అయితే ఊరి పేరులో ఉన్న అగ్రహార్‌ కారణంగా గ్రామం మొత్తాన్ని దేవాదాయశాఖకు చెందినదిగా ధ్రువీకరిస్తూ అధికారులు ఆరేళ్ల క్రితం నోటిఫైడ్‌ చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్‌(రెవెన్యూ సెటిల్‌మెంట్‌ రికార్డు)లో ఆలయానికి భూములున్నట్లు నిర్ధారించినప్పటికీ ఏ సర్వే నంబర్లలో ఉన్నాయో ధ్రువీకరించలేదు. దీంతో మొత్తం ఆలయ భూములేనని నోటిఫైడ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఈ అంశంపై రైతులు నిజామాబాద్‌ జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏడాదిన్నర క్రితం వారికి అనుకూలంగా ప్రాథమిక తీర్పు వెలువడింది. అయినప్పటికీ పట్టాలు మంజూరు కావడం లేదు. రెవెన్యూ, దేవాదాయశాఖల అధికారులు నక్షాలను పరిశీలిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భిక్కనూర్‌ సర్పంచి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజావాణితో పాటు రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.

"పూర్వీకుల కాలం నుంచి రెవెన్యూ రికార్డుల్లో పట్టా భూములుగా ఉన్నాయి. ఉన్నట్టుండి దేవాదాయ శాఖవిగా పేర్కొంటూ పాసుపుస్తకాల పంపిణీ నిలిపివేశారు. భూ దస్త్రాల ప్రక్షాళనకు పూర్వం రెవెన్యూ అధికారులు సర్వే నంబర్ల వారీగా హద్దులు నిర్ధారించారు. గత రికార్డులను పరిశీలించి మాకు న్యాయం చేయాలి."

- గడ్డం రంగయ్య, వెంకటాపూర్‌-అగ్రహార్‌

వెంకటాపూర్‌-అగ్రహార్‌లోని భూములను దేవాదాయశాఖవిగా పేర్కొంటూ నోటీసులు జారీ చేయడంతో డిజిటల్‌ పట్టా పాసుపుస్తకాల పంపిణీని నిలిపివేశాం. గ్రామంలోని భూములకు సంబంధించిన రెవెన్యూ దస్త్రాలను పరిశీలించి వాస్తవ పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదిస్తాం. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతాం.

- శ్రీను, ఎల్లారెడ్డి ఆర్డీవో

ఇదీ చదవండి:Forest in farm land: ఈ మాస్టారు.. పంటపొలాన్నే అడవిగా మార్చేశారు.!

ABOUT THE AUTHOR

...view details