High court on kamareddy mastar plan కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై తమ అనుమతి లేకుండా ముందుకెళ్లొద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ చేపట్టింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలపై ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని.. తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
Kamareddy Master Plan Issue Updates: ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు పూర్తిగా రద్దు చేయకుండా తాత్కాలికంగానే ఎందుకు నిలిపి వేశారని ధర్మాసనం అడిగింది. గతంలో ఇచ్చిన తీర్పు మేరకు మాస్టర్ ప్లాన్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేఏ పాల్ వాదించారు. తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మార్చాలనుకుంటే హైకోర్టు అనుమతి తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు ఈ మాస్టర్ ప్లాన్ గొడవ ఏంటంటే..?రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ బృహత్ ప్రణాళికను దిల్లీకి చెందిన ఓ సంస్థతో ఇటీవల తయారు చేయించారు. కామారెడ్డి పట్టణంతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, టెకిర్యాల్ , కాల్సిపూర్, దేవునిపల్లి, లింగాపూర్, సరంపల్లి, పాతరాజంపేట, రామేశ్వరపల్లిని కలుపుకుని 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మాస్టర్ ప్లాన్ ముసాయిదా తయారు చేశారు.