తెలంగాణ

telangana

ETV Bharat / state

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్ వివాదం.. విచారణ ఎల్లుండికి వాయిదా - హైకోర్టు తాజా వార్తలు

Telangana HC
Telangana HC

By

Published : Jan 9, 2023, 2:18 PM IST

Updated : Jan 9, 2023, 7:52 PM IST

14:16 January 09

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్ వివాదం.. విచారణ ఎల్లుండికి వాయిదా

Kamareddy master plan dispute updates: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్ వివాదంలో రైతుల అభ్యంతరాలపై వైఖరి ఏమిటో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకొని చెప్పేందుకు అడ్వకేట్ జనరల్ గడువు కోరడంతో విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ.. పక్కనే ఉన్న పట్టా భూములను ప్రజా అవసరాల కోసం కేటాయించారని రామేశ్వర్‌పల్లెకు చెందిన రైతులు వేసిన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. స్థిరాస్థి వ్యాపారుల ప్రయోజనాల కోసమే మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారని.. రైతుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

కోర్టులో విచారణ తేలేవరకు మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోకుండా ఆదేశించాలని.. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా కామారెడ్డి మున్సిపల్ కమిషనర్​కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. రైతుల తరఫున ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టుకు వచ్చారు. వాదనల్లో జోక్యం చేసుకున్న కేఏ పాల్ రైతులకు అన్యాయం జరుగుతోందని.. దీని వెనక భారీ కుట్ర ఉందని.. తన వాదనలు కూడా వినాలన్నారు. ప్రభుత్వం స్పందన ఏమిటో తెలుసుకొని చెప్పాలని ఏజీని ఆదేశిస్తూ విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ వివాదంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి తానే స్వయంగా వాదించనున్నట్లు కేఏ పాల్ మీడియాకు తెలిపారు.

మరోవైపు కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతుల నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. ఆందోళనలో భాగంగా రైతు ఐక్యకార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్​లకు వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్​లకు వినతిపత్రాలు ఇచ్చారు. ఇందులో భాగంగానే పార్టీలకు అతీతంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్ కౌన్సిలర్​లకు వినతి పత్రాలను కమిటీ సభ్యులు అందించారు. పట్టణ బృహత్‌ ప్రణాళిక ముసాయిదా రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్‌లో.. రైతులకు అనుకూలంగా తీర్మానం చేయాలని విన్నవించారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌లో భూములు పోవని భరోసా ఇచ్చిన మున్సిపల్ పాలక వర్గ సభ్యులు.. అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2023, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details