Floods Effect on Telangana 2023 : తెలంగాణలో అతి భారీ వర్షాలకు వాటిల్లిన నష్టం.. ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. అనేక జిల్లాల్లో... రహదారులు, వంతెనలు కొట్టుకుపోయి దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు పునరుద్ధరించినా... పూర్తిస్థాయిలో రాకపోకలు సాధ్యపడంలేదు. నీటి ప్రవాహం తగ్గితేనే ఏ మేరకు నష్టం వాటిల్లిందనే అంశాన్ని అంచనా వేయగలమని... అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. మరోవైపు వరద నీట మునిగిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్రంలోని రెండు డిస్కంల పరిధిలో రూ.21 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.
Huge Damage Due to Floods in Telangana : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల జాతీయ, రాష్ట్ర రహదారులు ధ్వంసం కాగా... మొత్తంగా 49 వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. అదేవిధంగా పలు రహదారులు కోతకు గురవ్వగా... మరికొన్నింటిపై గుంతలు పడి అధ్వానంగా మారాయి. శుక్రవారం సాయంత్రం వరకు కూడా కొన్ని రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జాతీయ రహదారులకు సంబంధించి 11 చోట్ల, రాష్ట్ర రహదారులకు సంబంధించి 38 ప్రాంతాల్లో వంతెనలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. కేవలం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనే 15 వంతెనలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. జాతీయ, రాష్ట్ర రహదారులు కలిపి జగిత్యాల జిల్లాలో 10 వంతెనలు, రాజన్న సిరిసిల్లలో 4, ఆదిలాబాద్‌లో 3, జనగామ, మంచిర్యాల, ములుగు, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లో 2 చొప్పున వంతెనలు ధ్వంసమైనట్లు గుర్తించారు. సుమారు 250 ప్రాంతాల్లో రహదారులపై నుంచి వరద నీరు ప్రవహించినట్లు అధికారులు అంచనా వేశారు.
Telangana Floods 2023 :ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని రహదారుల తాత్కాలిక మరమ్మతులకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచిన నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారాల వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం ఒక్కో ఈఈ(ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు)కు రూ. 1.50 కోట్లు, ఎస్ఈ (సూపరింటెండెంట్ ఇంజినీరు)కు రూ.2 కోట్లు, సీఈ (చీఫ్ ఇంజినీరు)కు రూ.3 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా అందుబాటులో ఉన్న రూ.120 కోట్లను తాత్కాలిక మరమ్మతులకు వాడుకోవాలంది. ఇంజినీరింగ్ అధికారులను భారీ మరమ్మతుల ప్రతిపాదనలు మాత్రం రాష్ట్రస్థాయికి పంపాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న జాతీయ రహదారుల మరమ్మతులకు తక్షణం రూ.29 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.