కామారెడ్డి జిల్లా బీబీపేట్ పాఠశాలపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు(Mahesh babu twitter) స్పందించారు. ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ గురించి తెలుసుకున్న ఆయన... శ్రీమంతుడు బృందంతో కలిసి పాఠశాలను సందర్శిస్తానని ట్వీట్ చేశారు. బీబీపేట్ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సుభాష్‌రెడ్డి వంటి వాళ్లు సమాజానికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ పాఠశాల ప్రారంభోత్సవం ఫొటోలను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో పోస్ట్ చేయగా... మహేశ్‌బాబు దీనిపై రెస్పాండ్ అయ్యారు.
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలకేంద్రంలో ప్రముఖ వ్యాపార వేత్త సుభాశ్ రెడ్డి తన సొంత ఖర్చులతో నిర్మించిన పాఠశాలను(KTR in School Inauguration) మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంత గొప్పగా పాఠశాల నిర్మించడం హర్షించదగ్గ విషయమని ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా అన్నారు. సొంత ఊరి రుణం తీర్చుకునే అవకాశం అందరికీ రాదన్నారు. పాఠశాల నిర్మాణం కోసం రూ.6.5 కోట్లు వెచ్చించిన వ్యాపారవేత్తను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వారి నానమ్మ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కొత్త హంగులతో నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.
కార్పొరేట్‌ను తలదన్నేలా బీబీపేట్ జడ్పీ ఉన్నత పాఠశాల భవనం నిర్మాణం జరిగింది. రూ.6 కోట్లతో ఆధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మాణం చేపట్టారు. 42 వేల చదరపు అడుగుల్లో 32 సువిశాల గదుల్లో డిజిటల్ తరగతులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటు చేశారు. గ్రంథాలయం, మూత్రశాలలు, నీటి శుద్ధి కేంద్రం, భోజనశాల, ఆట వస్తువులు, ఉపాధ్యాయులకు విశ్రాంత గదులను ఏర్పాటు చేశారు.