కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ పరిధిలో నూతనంగా విస్తరించనున్న బాన్సువాడ నుంచి తాడ్కోల్ వైపు వెళ్లే రహదారిని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
బాన్సువాడ పట్టణం మున్సిపాలిటీగా అవతరించాక రోడ్లను విస్తరించడం, నూతనంగా నిర్మించడం వంటివి పెద్ద ఎత్తున జరుగుతున్నాయని సభాపతి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రధాన రహదారి విస్తరణ పూర్తై, 4 వరుసలతో రాష్ట్రంలోనే ఒక మోడల్‌గా ఉందన్నారు. పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే రహదారిపై జుక్కల్, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు మహారాష్ట్ర వాహనాలు కూడా తిరుగుతున్నాయన్న ఆయన.. వాహనాల రద్దీ దృష్ట్యా తాడ్కోల్ చౌరస్తా నుంచి సుమారు ఒక కిలోమీటరు వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని ఫోర్ లైన్‌గా విస్తరిస్తామని చెప్పారు. సెంట్రల్ డివైడ్, ఇరువైపులా డ్రైనేజీ, ఫుట్‌పాత్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.