కామారెడ్డి జిల్లా 2020-21 వార్షిక ప్రణాళిక రూ. 3729 కోట్లకు ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ) ఆమోదముద్ర వేసింది. ఇందులో రూ. 3329 ప్రాధాన్య రంగాలు, మిగిలిన సుమారు రూ. 400 కోట్లు ప్రాధాన్యేతర రంగాలకు చోటు కల్పించారు. గత ఏడాది కంటే స్వల్పంగా రూ. 83 కోట్లు పెరిగింది. జిల్లాలో రూ. 2185 కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు.
పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా అన్నదాతకు ఆర్థిక చేయూతనిచ్చేలా సులువుగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గత వానాకాలంలో పంట రుణాల లక్ష్యం కొంత వెనుకబడింది. ఈసారి ధరణి ఆధారంగా పట్టా పాసుపుస్తకం, పహాణీ లేకుండానే రుణాలు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
లక్ష్యాలు అధిగమించేలా...
గత ఏడాది రూ.3646.12 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని నిర్ణయించగా మార్చి నాటికి 80 శాతం మేర మంజూరు చేశారు. పంట రుణాల మంజూరులో కొంత వెనుకబడి ఉంది. వ్యవసాయ రుణాల మాఫీపై సరైన మార్గదర్శకాలు అందకపోవడం వల్ల రుణాల పంపిణీపై ప్రభావం పడింది. ప్రస్తుతం రుణ మాఫీపై స్పష్టత రావడం వల్ల రుణాల లక్ష్యం పెరగనుందని భావిస్తున్నారు.