Bheemeshwara Temple: పరమేశ్వరుడు అనగానే ఎవరికైనా శివలింగమే గుర్తొస్తుంది. కానీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్‌లోని ఈ ఆలయంలో కొలువు దీరిన శివుడు పంచముఖ రూపంలో దర్శనమిస్తాడు. దట్టమైన అడవి, రాళ్ల గుట్టలు, బల్ల పరుపులాంటి రాయి మీద ఆహ్లాదకరమైన ప్రాంతంలో ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడు. భీమేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ గుడిలో లింగాన్ని ఎవరు ప్రతిష్టించారు.. ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్న దానికి ఆధారాలు లేవు. కానీ వెయ్యేళ్ల క్రితం అరణ్య వాసంలో భాగంగా పాండవులు ఈ ప్రాంతంలో సంచరించి కొద్దికాలం పాటు తలదాచుకున్నట్లు స్థలపురాణం తెలియజేస్తుంది. ఆ సమయంలోనే భీముడు తాను పూజించుకునే నిమిత్తం శివుడిని ప్రతిష్టించి కొలిచినట్లు పెద్దలు చెబుతారు. అందుకే ఈ ఆలయం భీమేశ్వరాలయంగా పిలువబడుతోంది.
ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు
సంతాయిపేట భీమేశ్వరాలయంలో ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలు ఉన్నాయి. శివుడు పంచముఖ రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులే స్వయంగా శివలింగానికి నీళ్లతో అభిషేకం చేస్తారు. సాధారణంగా కాకతీయులు నిర్మించిన ఆలయాలకు ఉత్తర ద్వారం ఉంటుంది. కానీ ఈ క్షేత్రంలో పడమర ముఖం ద్వారం ఉండటం గమనార్హం. కాలభైరవుడు, గణపతి, పార్వతీ, పరమేశ్వరులు ఇక్కడి ప్రాంగణంలో కొలువుదీరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భీమేశ్వరాలయంలో కుంతీదేవి విగ్రహం ఉంది. సంతాన భాగ్యం లేని వారు కుంతీదేవికి పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఎక్కడ చూసినా ఆంజనేయుని చేతిలో గద ఉంటుంది కానీ ఇక్కడి ఆలయ ప్రాంగణంలో రాతిపై చెక్కిన ఆంజనేయుని చేతిలో మాత్రం హారం ఉంది. ఇలా ఎందుకంటే లంక నుంచి వచ్చిన ఆంజనేయుడు సీతమ్మ హారం శ్రీరాముడికి ఇస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని చెక్కిన చిత్రంగా పూర్వీకులు చెబుతున్నారు. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో రాళ్లపై చెక్కిన వినాయకుని చిత్రాల్లో మెడలో సర్పాలు ఉన్నాయి. ఇంకా కాలభైరవుడు ,వినాయకుడు, కుంతిదేవి, పాండవుల విగ్రహాలు చెక్కి ఉన్నాయి.
సుందరంగా పాండవుల చిత్రాలు
ఆలయ గర్భగుడి లోపలి భాగం గుహ లాగా ఉంటుంది. గర్భగుడి పైభాగం నాగ పడగ రూపంలో కనిపిస్తుంది. ప్రధాన గుడి దక్షిణ భాగంలో పార్వతి దేవి ఆలయం నిర్మించారు. ఇందులో ప్రసిద్ధి గాంచిన ఆళ్ల బండ ఉంది. ఈ ఆలయం సమీపంలోని బండరాళ్లపై చెక్కిన గణపతి సప్త మాతృకలు. శ్రీకృష్ణ సమేత పంచ పాండవుల చిత్రాలు ఎంతో సుందరంగా ఉన్నాయి.