Revanth Reddy spoke at the farewell meeting of Bharat Jodo Yatra: రైతులు పండించిన పంటను కొనలేని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న లేకపోయినా ఒకటేనన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి... ఇలాంటి ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతులపై లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ సర్వనాశనం అవుతుంటే మేధావులు ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర గర్జన పేరుతో జరిగిన ముగింపు సభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రేవంత్ రెడ్డి ఎండగట్టారు.
కన్యాకుమారి నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర కశ్మీర్ వరకు కొనసాగనుందని.. తెలంగాణ రాష్ట్రంలో 12రోజులపాటు కొనసాగిన యాత్రలో లక్షలాదిమంది రాహుల్‌తో పాటు కదం తొక్కారన్నారు. భాజపా, టీఆర్ఎస్లు దేశాన్ని విచ్ఛిన్నం చేసి విద్వేషాలను రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో తెల్లదొరలను దేశ సరిహద్దులకు తరమికొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందా అని ప్రశ్నించారు.
నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ ప్రజలు చేసిన ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ఎంతోమంది అమరులయ్యారని.. అమరవీరుల ఆశయాలు ఏ ఒక్కటి నెరవేరడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ దేశాన్ని అధఃపాతాళానికి తీసుకెళ్లే కుట్ర చేస్తుంటే.. అందుకు కేసీఆర్ సహకరిస్తున్నారని ఆరోపించారు. గాలిలో తిరగడం కాదు.. దమ్ముంటే మోదీ, కేసీఆర్ ప్రజల్లోకి రండి అని సవాల్ విసిరారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని ఆ యాత్రలో తాను పాల్గొనడం ద్వారా తన జన్మధన్యమైనట్లు పేర్కొన్నారు.
గత 12 రోజులుగా లక్షలాది మంది కదం కలుపుతూ తెలంగాణలో యాత్రను విజయవంతం చేశారు. అవసరమైతే కార్యకర్తలు ప్రాణాలు విడిచారు.. కానీ ఈ మూడు రంగుల జెండాను వదలలేదు. భాజపా, తెరాసలు దేశాన్ని విచ్ఛిన్నం చేసి విద్వేషాలు రెచ్చగొట్టి గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్య స్పూర్తితో తెల్ల దొరలను దేశ సరిహద్దులకు తరిమిన చరిత్ర కాంగ్రెస్‌ది. నిజాం నిరంకుషానికి వ్యతిరేకంగా నడుం బిగించిన చరిత్ర తెలంగాణ సొంతం. రైతు పండించిన పంటను కొనలేని ఈ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ఎంత పోతే ఎంత? ఇలాంటి ప్రభుత్వాలను శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతులపై లేదా? తెలంగాణ సర్వ నాశనం అవుతుంటే మేధావులు ఎందుకు కేసీఆర్ కు లొంగిపోయారు. మోదీ దేశాన్ని అధః పాతాళానికి తీసుకెళ్లే కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రకు కేసీఆర్ సహకరిస్తున్నారు. - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
భారత్ జోడో యాత్ర ముగింపు సభలో ప్రసంగిస్తున్న రేవంత్‌రెడ్డి ఇవీ చదవండి: