Revanth Reddy Fired On Minister KTR: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ విచారణ చేస్తే ఇంటి దొంగలు దొరుకుతారనీ ఉద్దేశ్యంతో.. మంత్రి కేటీఆర్ ముందుకొచ్చి అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. కామారెడ్డి జిల్లాలోని రాజంపేటలో జరిగిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. మంత్రి కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
పేపర్ లీకేజీ విషయంలో నేరగాళ్లను విచారించకుండా కేటీఆర్ నేరుగా ఇద్దరే నిందితులని తీర్పు చెపుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కేసులో వీరి ఇద్దరికీ తప్ప.. మరే ఇంకొకరికీ ఇందులో భాగం లేదని మంత్రి ఎలా చెప్పుతారని ప్రశ్నించారు. వెంటనే మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సూచించారు. పేపర్ లీకేజీ ఘటనను గతంలో లీకేజీ ఘటనల్లాగానే నీరుగార్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. హ్యాకింగ్, హనీ ట్రాప్, లీక్.. అసలేం ఏం జరిగిందో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
గవర్నర్‌ను కలవనున్న కాంగ్రెస్ బృందం: ఈ కేసును సీబీఐకి అప్పగించాలి.. లేదంటే సిట్టింగ్ జడ్జితో అయినా విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై.. ఈ నెల 21వ తేదీన గవర్నర్‌ను కలిసి.. సీబీఐ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను లేఖ రాయనున్నట్లు కోరతామని వివరించారు. టీఎస్పీఎస్సీ గత ఏడాది నుంచి నిర్వహించిన పరీక్షల అన్నింటిపై విచారణ చేయాలని కోరారు. ఛైర్మన్, సభ్యులు అందరికీ విచారణ జరిపించాలని.. వారిని విధుల నుంచి తొలగించి.. త్వరలో పరీక్షలు నిర్వహించాలని సూచించారు.