Reasons for KCR Defeat in Kamareddy: కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టు కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి అలాగే ఉంది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డిని ఎంచుకోవడానికి కారణమేంటి అన్నది ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఎందుకు రెండు చోట్ల పోటీచేస్తున్నారో ప్రజలకు అర్థం కాలేదు. కామారెడ్డిలో గెలిచినా గజ్వేల్‌లో ఉంటానని కేసీఆర్ చెప్పడం దెబ్బ తీసింది. కామారెడ్డి కోసం నియమించిన ఇంఛార్జీలు సమన్వయం చేయలేకపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేటీఆర్, శేరి సుభాష్‌రెడ్డితో పాటు గంపగోవర్ధన్, తిర్మల్ రెడ్డి నియోజకవర్గంలో నేతలను సమన్వయం చేయలేకపోయారు. ప్రధానంగా గంప గోవర్ధన్ పాత్రపై(Gampa Govardhan Role in KCR Defeat) అంతా చర్చించుకుంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానంలో కేసీఆర్ పోటీ చేస్తాననడం గంప గోవర్ధన్‌కి ఇష్టం లేదని స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. పైగా ఎన్నికల వేళ నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు కాంగ్రెస్‌లోకి వెళ్తుంటే ఆపాల్సిందిపోయి, ప్రోత్సహించారని చెబుతున్నారు. తానూ ఎలాగూ ఏమీ చేయలేదు ఆ పార్టీ చేస్తానంటే వెళ్లండని నేరుగా చెప్పడంతో ఆ పార్టీ నాయకులు విస్తుపోయారని అంటున్నారు.
ప్రజాతీర్పును గౌరవిద్దాం - ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష ఉంటుందన్న కేసీఆర్
పోలింగ్ ముందు పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ స్థానిక నాయకులు చేతివాటం చూపించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సగంపంచి సగం సొంత జేబులో వేసుకున్నట్టుగా కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. గంప గోవర్ధన్‌తో పాటు నర్సింగరావు, సుభాష్‌రెడ్డి, ముజీబుద్దీన్‌లు తూతూమంత్రంగా పనిచేస్తూ ప్రచారం మమ అనిపించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముజీబుద్దీన్ అనుచరుడైన చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం వెనుకా జిల్లా అధ్యక్షుడి పాత్ర ఉందని మాట్లాడుకుంటున్నారు.