నేటి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ధనార్జన తప్ప మరొకటి పట్టించుకోవడం లేదు. నిద్ర లేచింది మొదలు సంపాదనే ధ్యేయంగా బతుకుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగమూ అలాంటిదే. అయితే అందరూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఇందుకు ఉదాహరణ. స్థిరాస్తి రంగంలో రాణిస్తూ సొంతూరిపై ప్రేమ, చదువుకున్న పాఠశాల పట్ల మమకారం పెంచుకున్నారు. ఊరు కోసం ఏదైనా చేయాలని కంకణం కట్టుకున్నారు. రూ.6కోట్లతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను, పేదల కోసం ప్రభుత్వంతో కలిసి రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారు. తనదైన రీతిలో సినిమా తరహాలో ఊరు కోసం సాయం చేస్తున్న రియల్ ఎస్టేట్ డెవలపర్ సుభాష్ రెడ్డి... ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
రూ.ఆరు కోట్లతో..
బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన చదువుకున్నారు. దశాబ్దాల కింద నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. విద్యార్థులకు భయం గుప్పిట్లో చదువుతున్నారు. ఈ విషయం గమనించిన ఆయన నూతన భవనం నిర్మించాలని భావించారు. ఇందుకోసం ఏకంగా రూ.6కోట్లు వెచ్చించి కార్పొరేట్ స్థాయిలో పాఠశాల నిర్మించారు.
కొత్త పాఠశాలలో జీ ప్లస్ వన్ విధానంలో భవంతిని నిర్మించాం. ఇందులో మొత్తం 36 గదులు ఉన్నాయి. డిజిటల్ తరగతులు, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఉపాధ్యాయులకు విశ్రాంతి గదులు, తాగునీటి సౌకర్యం, మూత్రశాలు.. ఇలా సకల సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేశాం. 2020 అక్టోబర్ 30న సబితా ఇంద్రారెడ్డి ఈ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఎనిమిది నెలల్లోనే నిర్మాణం తుది దశకు చేరింది. త్వరలోనే ఈ పాఠశాలను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. ఉన్నదాంట్లోనే నలుగురికి సాయపడాలనే సదుద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నా.
-సుభాష్ రెడ్డి, స్థిరాస్తి వ్యాపారి
విల్లాల తరహాలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు
మనం గొప్ప స్థాయిలో ఉండి వేరేచోట ఉన్నా... పుట్టిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేదంటే లావైపోతారు అని ఓ తెలుగు సినిమాలో డైలాగ్. దానినే ఆచరణలో పెట్టారు సుభాష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లను విల్లాలను తలపించేలా నిర్మిస్తున్నారు. ప్రభుత్వం అందించే రూ.5లక్షలకు అదనంగా మరో రూ.2 లక్షల వరకు తన సొంత నిధులు వెచ్చించి తన సొంతూరు జనగామలో 50 రెండు పడక గదుల ఇళ్లను నిర్మించారు. సుభాష్ రెడ్డి ఔదార్యం పట్ల ఆ ఊరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.