Man trapped inside cave and rescued కామారెడ్డి జిల్లాల్లో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుని నరకయాతన అనుభవించిన యువకుడు రాజును అధికార యంత్రాంగం రక్షించింది. పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతడిని కాపాడారు. సుమారు 42 గంటల తర్వాత అధికారుల కృషి ఫలించడంతో రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
బండరాళ్ల నుంచి క్షేమంగా బయటపడిన రాజు - Man trapped inside cave in Kamareddy UPDATES
13:56 December 15
Man trapped inside cave and rescued
మంగళవారం సాయంత్రం రాజు ఇరుక్కుపోగా.. బుధవారం నుంచి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగించారు. జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఇన్‌ఛార్జి తహసీల్దార్ సాయిలు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాజును క్షేమంగా బయటకు తీయడంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేసి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
వేటకు వెళ్లినందున తొలుత సమాచారం ఇవ్వకుండా..రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్‌తో కలిసి ఘన్‌పూర్ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపించాయి. వేటకు వెళ్లిన కారణంగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు శ్రమించారు. వీలుకాదని తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. రాజును బయటకు తీసేందుకు ఏఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో యంత్రాలతో బుధవారం రాత్రి కూడా ప్రయత్నాలు కొనసాగించారు. అతడికి ధైర్యం చెబుతూ.. నీళ్లు, ఓఆర్‌ఎస్ తాగించేందుకు ప్రయత్నించారు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఇవీ చూడండి: