కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడుకోల్ గ్రామంలో లబ్ధిదారులకు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అర్హత గల లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని పోచారం చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటివరకు 5000 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. ఇంకా 10 వేల ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసే విధంగా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అవినీతికి పాల్పడితే చర్యలే
లబ్ధిదారులు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇల్లు తీసుకున్నట్లు తెలిస్తే వారి ఇల్లును రద్దు చేసి అర్హత గల నిరుపేదలకు అందజేస్తామని పోచారం అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా రెండు పడకల ఇల్లు ఇప్పిస్తామని అవినీతికి పాల్పడినట్లు తేలితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.