కోటి 50 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించగల కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా నిలిచారంటూ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కొనియాడారు. ఉచిత కరెంటు, పెట్టుబడి, రైతుబంధు వంటి వాటితో రైతుకు వెన్నంటే ఉండి కృషి చేస్తున్నారని వివరించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి మంజీరా నది నుంచి వస్తోన్న నీటికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొని.. గోదావరి జలాలకు స్వాగతం పలికారు.
రాష్ట్రంలో గతంలో నీటి కొరత విపరీతంగా ఉండేదని పోచారం గుర్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్‌లో.. సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని ఆనాటి ముఖ్యమంత్రుల వద్ద రైతులు పడిగాపులు కాసేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అలా బాధపడ్డ రైతుల్లో.. తానూ ఒకడినని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో.. కేసీఆర్ పుణ్యమా అని సాగు నీటి కష్టాలు తీరిపోయినట్లు వివరించారు.