PM Modi Election Campaign in Kamareddy Today :బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు.. ఆ పార్టీ పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. గులాబీ పార్టీ పాలనలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. అలాగే 7 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ నుంచి ప్రజల విముక్తి కోరుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ(BJP Public Meeting)లో మోదీ పాల్గొని.. ప్రసంగించారు.
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ ఏదైతే చెబుతుందో వాటిని తప్పకుండా నెరవేర్చి తీరుతుందని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు(Woman Reservations) ఇచ్చామని.. అలాగే రాష్ట్రానికి ఇచ్చిన పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ హామీలను కేంద్రం నెరవేర్చిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అత్యధికంగా మంత్రి పదవులను ఇచ్చామని చెప్పారు. దళిత వ్యక్తిని సీఎం చేస్తాన్న కేసీఆర్.. హామీ ఏమైందని ప్రధాని మోదీ ప్రశ్నించారు. బీసీ, దళితులకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ఏమీ చేయలేదని విమర్శించారు.
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం : ప్రధాని మోదీ
'తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి అన్యాయం జరిగింది. మాదిగల వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది. మాదిగల వర్గీకరణ కోసం కమిటీ వేశాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ప్రాజెక్టుల పేరుతో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడింది. బీఆర్‌ఎస్ నేతలకు డబ్బు కావాలంటే కొత్తగా ప్రాజెక్టులు నిర్మిస్తారు. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.2.75లక్షల కోట్లు జమ చేశాం. పీఎం కిసాన్ సమ్మాన్ ద్వారా 40 లక్షల మంది రాష్ట్ర రైతులు లబ్ధి పొందారని' ప్రధాని మోదీ చెప్పారు.