గ్రామంలో మంచినీటి కోసం బోరు వేసేందుకు భూమి ఇవ్వలేదని ఆ కుటుంబాన్ని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు బహిష్కరించారు. వారితో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు, రూ.10 వేలు జరిమానా విధిస్తామని ఆంక్షలు విధించారని బాధితులు వాపోయారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది.
ఏం జరిగిందంటే...?
గ్రామనికి చెందిన మాజీ కారోబార్ నాగేందర్ రావు భూమిలో 20 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ వారు బోరు వేయించారు. దాని ద్వారా గ్రామానికి మంచినీటిని అందించారు. ప్రస్తుతం నాగేందర్ రావు వ్యవసాయనికి నీటి కొరత ఏర్పడడంతో పాటు... పంచాయతీ సిబ్బంది వేసిన పనికిరాకుండా పోయింది. అదే స్థలంలో మరో బోరు వేసేందుకు గ్రామపంచాయతీ పాలకవర్గం సిద్ధమవగా.. నాగేందర్ రావు నిరాకరించారు. ఎలాగైనా అదే స్థలంలో బోరు వేస్తామని బాధిత కుటుంబాన్ని అధికారులు బెదిరించారని ఆయన ఆరోపించారు.