Raju who was stuck between rocks: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్‌తో కలిసి ఘన్‌పూర్ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపించాయి. వేటకు వెళ్లిన కారణంగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు శ్రమించారు.
48 గంటలు బండరాళ్ల మధ్య నరకయాతన: కుటుంబసభ్యులు, మిత్రులు, గ్రామస్థుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. రాజు బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన విషయాన్ని చివరకు పోలీసులకు చేరవేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసు, అగ్నిమాపక, వైద్య సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతమైన సింగరాయపల్లి అడవికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. రాజును బయటకు తీసుకురావడానికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. పెద్దపెద్ద బండరాళ్లు అడ్డుగా ఉండటంతో వాటిని బ్లాస్టింగ్ చేస్తూ అధికారులు తమ ప్రయత్నాలు సాగించారు. డ్రిల్లింగ్ చేస్తూ బండరాళ్లను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వచ్చారు.
మరోపక్క.. తొలుత రాజును రక్షించేందుకు యత్నించిన అశోక్.. ఎప్పటికప్పుడు రాజులో మనోధైర్యం నింపుతూ వచ్చాడు. అధికారులు అందించిన ద్రవపదార్థాలు అన్నీ రాజుకు చేరవేసి వాటిని రాజు తీసుకునేలా జాగ్రత్తలు పాటించాడు.అశోక్, రాజుకు సహాయం చేసిన వ్యక్తి అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నా, అశోక్ ఎప్పటికప్పుడు రాజులో మనోధైర్యం నింపుతున్నా చుట్టుపక్కల ఉన్నవారికి ధైర్యం సన్నగిల్లుతూ వచ్చింది. రాజు సురక్షితంగా బయటకు వస్తాడా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
42 గంటల తర్వాత ఎట్టకేలకు అధికారుల శ్రమ ఫలించింది. పోలీసు, వైద్య, అగ్నిమాపక సిబ్బంది.. రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హుటాహుటిన రాజును వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజు సురక్షితంగా బయటకు రావడం పట్ల ఆయన భార్య సంతోషం వ్యక్తం చేసింది. తీవ్రంగా శ్రమించిన అధికారులు, మీడియాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.