తెలంగాణ

telangana

ETV Bharat / state

పంట ఆరబోత.. అవస్థల మోత - crop sales issues in Nizamabad

పంట ఉత్పత్తులు ఆరబెట్టేందుకు కల్లాలు.. అవసరమైన టార్పాలిన్లు లేక ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో కర్షకులకు పంట ఆరబోత కష్టాలు తప్పడం లేదు. గత్యంతరం లేక రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. ట్రాఫిక్‌ సమస్యలు.. వాహన చోదకులతో నిత్యం ఇబ్బందులు.. పోలీసుల వేధింపులను తట్టుకోవడం కర్షకుడికి ప్రాణ సంకటంగా మారింది.

Nizamabad farmers are facing problems
నిజామాబాద్ రైతుల కష్టాలు

By

Published : Oct 30, 2020, 1:43 PM IST

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న, సోయాబీన్‌ పంట నూర్పిళ్లు, విక్రయాలు దాదాపు పూర్తయ్యాయి. వరి కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యాన్ని ఆరబెట్టడానికి కల్లాలు అందుబాటులో లేక టార్పాలిన్లు వినియోగిస్తున్నారు. యంత్రలక్ష్మి పథకంలో కొత్త వాటి సరఫరా లేకపోవడంతో అద్దెకు తెచ్చు‘కొంటున్నారు’. మూడేళ్లుగా ప్రభుత్వ పంపిణీ నిలిచిపోవడంతో ఎరువుల సంచులను కుట్టించుకొని కొంతమంది, అద్దెకు తెచ్చుకొని మరికొంత మంది ధాన్యాన్ని ఆరబోస్తున్నారు.

ప్రభుత్వం ఇవ్వడం లేదు

గతంలో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖలు రైతులకు రాయితీపై టార్పాలిన్లు అందించేవారు. మూడేళ్లుగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 2016లో దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించాలని నిర్ణయించి, ఆచరణ సాధ్యం కాకపోవడంతో ఏకంగా పంపిణీనే నిలిపేశారు. నిధుల లేమితో 2018 నుంచి పూర్తిగా నిలిపివేశారు. గత్యంతరం లేక రైతులు బహిరంగ విపణిలో ఒక్కోటి రూ.1900 నుంచి రూ.2500 వరకు తెచ్చుకొంటున్నారు.

సోయా కుప్పకు తగిలి వ్యక్తి దుర్మరణం

రహదారిపై సోయా కుప్పకు అడ్డుగా పెట్టిన రాయికి తగిలి ఓ వ్యక్తి మృతి చెందారు. వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌కు చెందిన ముత్యాల శేఖర్‌(55), లక్కోరకు చెందిన కొండుక జనార్దన్‌లు బీడీ కంపెనీలో పని చేస్తున్నారు. పడగల్‌లో ఓ వివాహానికి వెళ్లిన ఇద్దరూ ద్విచక్రవాహనంపై తిరుగు పయనమయ్యారు. పడగల్‌ ఊరచెరువు సమీపంలో రోడ్డు పక్కన ఉన్న సోయా కుప్పకు అడ్డుగా పెట్టిన రాయిపైకి వాహనం వెళ్లడంతో అదుపుతప్పింది. శేఖర్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. జనార్దన్‌కు తలకు గాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. శేఖర్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొడుకు గల్ఫ్‌లో ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు తరలించారు. ఇప్పటి వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై శ్రీధర్‌గౌడ్‌ తెలిపారు.

రోజుకు రూ.288 అద్దె

నాలుగెకరాల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టా. కల్లాలు లేకపోవడంతో టార్పాలిన్లు అద్దెకు తెచ్ఛా ఒక తాటిపత్రికి రోజుకు రూ.12 అద్దె చొప్పున 24 టార్పలిన్లకు రూ.288 అవుతోంది. ఇప్పటికే ఐదు రోజులకు రూ.1440 ఖర్చు అయ్యాయి. బయట మార్కెట్‌లో కొనలేక ఆర్థికంగా ఇబ్బంది అవుతోంది.

- వేముల స్వామి, కమ్మర్‌పల్లి

ఎరువు సంచులతో..

మూడెకరాల్లో సన్నరకం వరి సాగు చేశా. పంట చేతికొచ్చింది. వారం రోజుల కింద పంటను కోసి బైపాస్‌ వద్ద జాతీయ రహదారిపై వడ్లను నూర్పిడి చేశా. టార్పాలిన్లు లేక ఎరువు సంచులతో కుట్టించి కప్పుతున్నా.

- గౌరు నడ్పి లింగన్న, బాల్కొండ

సర్కారు పంపిణీ చేయాలి

కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 13 రోజులవుతోంది. అకాల వర్షం భయానికి రోజుకు పది టార్పాలిన్లను కిరాయికి తెచ్చి కుప్పల మీద కప్పుతున్నా. అద్దె నిమిత్తం ఒక్కో దానికి రోజుకు రూ.10 చొప్పున చెల్లిస్తున్నా. సర్కారు రాయితీపై టార్పాలిన్లు అందజేయాలి.

- సాయవ్వ, మాలపాటి, లింగంపేట

సరఫరా లేదు

గతంలో రాయితీపై వ్యవసాయశాఖ ద్వారా టార్పాలిన్లు ఇచ్చేవారం. మూడేళ్లుగా ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి సరఫరా లేదు.

- గోవింద్‌, జిల్లా వ్యవసాయాధికారి, నిజామాబాద్‌

ABOUT THE AUTHOR

...view details