తీర్థయాత్రలు, శుభకార్యాలకు వెళ్లడానికి చాలా మంది ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకొంటారు. ఇందుకు ఆ సంస్థ పల్లె వెలుగు బస్సులకు కిలో మీటరుకు రూ.40, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 46, సూపర్ లగ్జరీకి, ఏసీ బస్సులకు రూ. 52 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తోంది. ముందస్తుగానే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణం ముగిసిన తర్వాత ఇతర ఛార్జీలు పోనూ మిగిలినవి తిరిగి ఇచ్చే వారు.
శుభకార్యాలకు ఇచ్చే అద్దె బస్సులకు కొత్త నిబంధనలు - శుభ కార్యాలకు ఇచ్చే బస్సులకు కొత్త నిబంధనలు
కరోనాతో ఆర్టీసీకి భారీగా నష్టం వచ్చింది. బస్సులు నడిపిస్తున్నా ఆశించిన ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకోవడానికి సంస్థ కొత్త మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కార్గో సేవలను అమల్లోకి తీసుకొచ్చింది. సత్ఫలితాలు రావడంతో తాజాగా అద్దె బస్సుల ఛార్జీలను భారీగా తగ్గించారు. తీర్థయాత్రలు, శుభ కార్యాలకు బస్సులు తీసుకెళ్లేవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
ఇక నుంచి కిలోమీటర్ల ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం ఉన్న ఛార్జీకి సగం శాతాన్ని ఎక్కువగా వసూలు చేయనున్నారు. అంటే సీట్ల అమరిక ఆధారంగా సాధారణ ఛార్జీలకు 50 శాతం అదనంగా తీసుకోనున్నారు. డిపాజిట్లు, స్లాట్ వ్యవస్థను రద్దు చేశారు. బస్సు తిరిగిన కిలోమీటర్లకు మాత్రమే ఛార్జీ వర్తిస్తుంది. ప్రయాణ పరిధిని 200 కిలోమీటర్ల వరకు పెంచారు. కావాల్సిన చోట దింపి తిరుగు ప్రయాణానికి నిర్దేశించిన వేళల్లోనే వచ్చి సేవలందించేలా మార్పులు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీవీఎం గణపతిరాజ్ పేర్కొన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు