తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా సమీకృత కలెక్టరేట్‌లు - నిజామాబాద్​ జిల్లాలో సమీకృత కలెక్టరేట్​లు సిద్ధం

పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా కొత్త జిల్లాల్లో ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్‌లు నిర్మిస్తోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కొత్త కలెక్టరేట్‌ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే భవనంలో ఉండేలా నిర్మాణం సాగుతోంది. ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఒకే దగ్గర అన్ని పనులు చేసుకుని వెళ్లేలా సమీకృత కలెక్టర్‌లు సిద్ధమవుతున్నాయి. దసరా నాటికి ప్రజల ముంగిటకు రానున్న నూతన కలెక్టరేట్ భవనాల నిర్మాణంపై కథనం.

పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా సమీకృత కలెక్టరేట్‌లు
పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా సమీకృత కలెక్టరేట్‌లు

By

Published : Sep 19, 2020, 7:54 PM IST

కొత్త జిల్లాలతో పాటు శిథిలావస్థలో ఉన్న పలు పాత జిల్లాల్లోనూ కొత్తగా సమీకృత కలెక్టరేట్‌లను నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్‌లతోపాటు కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మిస్తున్నారు. రూ. 61.50కోట్లతో నిజామాబాద్, రూ.57కోట్లతో కామారెడ్డి కలెక్టరేట్ భవనాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులను దసరా లోపు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. రూ.40కోట్లతో కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయ నిర్మాణం పూర్తైంది.

నూతన కలెక్టరేట్ భవనాలకు ప్రభుత్వం ఒకే నమూనాను రూపొందించింది. ఆధునాతన వసతులతో కార్పొరేట్ భవనాలను తలపించేలా ఉన్నాయి. ప్రధాన పనులు పూర్తవ్వగా.. తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్‌లను దసరాకు ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. నిజామాబాద్ కలెక్టరేట్‌ను నగర శివారులోని గిరిరాజ్ కళాశాల వెనుక భాగంలో బైపాస్ రోడ్డు ఆనుకుని 25ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సైతం అంతే విస్తీర్ణంలో పట్టణ శివారులోని అడ్లూర్ సమీపంలో నిర్మిస్తున్నారు.

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలు గ్రౌండ్ ఫ్లోర్, ఆపై రెండు ఆంతస్తులు నిర్మిస్తున్నారు. మొత్తం 1,59,307 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్ విస్తీర్ణం 53,940 చదరపు అడుగుల్లో, మొదటి అంతస్తు 50,874 చదరపు అడుగులు, రెండో అతస్తులో 54,493 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతోంది. మొదటి రెండు అంతస్తుల్లో వివిధ శాఖల కార్యాలయాలు, సమావేశ మందిరాలు నిర్మిస్తున్నారు. భవనం మధ్యలో పచ్చిక బయళ్లు, ఫౌంటేన్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌ల ఛాంబర్‌లు ఉంటాయి. సందర్శకుల కోసం విశ్రాంతి గది ఏర్పాటు చేస్తున్నారు.

మొదటి, రెండు అంతస్తుల్లో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది ఉంటారు. శాఖాధిపతుల కోసం ప్రత్యేకంగా ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఫ్లోర్‌ను నాలుగు బ్లాకులుగా విభజించి మూడు చోట్ల మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే నాలుగు లిఫ్ట్‌లు నిర్మించగా.. ప్రస్తుతం రెండు అందుబాటులోకి తీసుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో 500-1000 మంది పట్టేలా సమీక్షలు, సమావేశాల కోసం పెద్ద హాల్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మొదటి, రెండో అంతస్తుల్లోనూ 50-100మందికి సరిపడేలా ఒక్కో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు. ఇక్కడే వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించుకునేలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రజల కోసం తాగునీరు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

నూతన సమీకృత కలెక్టరేట్‌లు ప్రజలకు సులువుగా అన్ని పనులు ఒకే దగ్గర పూర్తి చేసేలా అందుబాటులోకి తెస్తుండగా.. భవనంలో వెలుతురు, గాలి సమృద్ధిగా ఉండేలా నిర్మించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.

ఇదీ చదవండి:సమీకృత కలెక్టరేట్​ను సందర్శించిన జిల్లా పాలనాధికారి

ABOUT THE AUTHOR

...view details