కామారెడ్డి పురపాలక సంఘం నూతన మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలపై కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్పందించారు. కన్సల్టెన్సీ, డీటీసీపీ చేసిన పొరపాటు వల్లే ఈ గందరగోళం నెలకొందని తెలిపారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయమని పేర్కొన్నారు. ఒక్క గుంట భూమి కూడా పోదని స్పష్టం చేశారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్ గురించి 60 రోజుల ముందే పత్రికల్లో ప్రకటన ఇచ్చారని పేర్కొన్నారు.
దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు జనవరి 11 వరకు సమయం ఉందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెప్పారు. కామారెడ్డిలో అనేక చోట్ల ఫ్లెక్సీల ద్వారా సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీ, కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని ఆరోపించారు. ముసాయిదా మాస్టర్‌ప్లాన్ అనే విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ లబ్ధి కోసమే.. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రతిపాదనలు తారుమారు చేసిన కన్సల్టెన్సీ, డీటీసీపీ అధికారులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. స్ధానిక పరిస్థితులకు అనుగుణంగా, అందరి ఆమోద యోగ్యంగా ఉండేలా తుది ప్లాన్ ఉంటుందని గంప గోవర్ధన్ స్పష్టం చేశారు.