కరోనా మహమ్మారి నిర్మూలనకు ఎట్టకేలకు వ్యాక్సిన్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జనహిత సమావేశ మందిరంలో కొవిడ్- 19 వ్యాక్సినేషన్ పంపిణీపై జిల్లా వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో 12వేల మందికి...
కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేసిన వైద్యారోగ్య, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర అధికారులకు మంత్రి వేముల ధన్యవాదాలు తెలిపారు. గతంలో 22 శాతం పాజిటివ్ ఉన్న కామారెడ్డి జిల్లా నేడు 0.3 శాతానికి తగ్గిపోయిందన్నారు. మొదట విడతగా దేశంలోని 3 కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ చేస్తుండగా... అందులో రాష్ట్రంలో 15 లక్షల మందికి కామారెడ్డి జిల్లాలో 12 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
30 కేంద్రాలు...
వ్యాక్సిన్ పంపిణీకి జిల్లాలో 30 కేంద్రాలను ఏర్పాటు చేసి 60 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్, సీరం తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్లు మాత్రమే పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. వ్యాక్సిన్ వికటించిన వారికి ఏఈఎఫ్ఐ రియాక్షన్ కిట్లను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.
విజయవంతం చేయండి...
వ్యాక్సిన్ హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు అక్కడి నుంచి పీహెచ్‌సీలకు ప్రత్యేక వాహనాలలో నేరుగా తరలిస్తారని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతానికి అధికారులందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్, ఎస్పీ శ్వేతారెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, జడ్పీ ఛైర్మన్ దఫెడర్ శోభ, డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:హైదరాబాద్ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్ టీకాలు