ఇంటింటి ఫీవర్ సర్వే గొప్ప కార్యక్రమమని మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, వైద్యులు, జిల్లా వైద్యాధికారులు కరోనా నివారణ కోసం నిరంతరం పని చేస్తున్నారన్నారు. వారి కష్టానికి ఫలితంగానే కామారెడ్డి జిల్లాలో 28 శాతం ఉన్న పాజిటివ్ రేటు 14 శాతానికి తగ్గిందన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 200 బెడ్లు, ప్రైవేటు ఆస్పత్రుల్లో 471 పడకలు అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టరేట్లో సమీక్ష అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పడకల అందుబాటు
కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ చాలా ముఖ్యమైందని, జిల్లా ఆస్పత్రిలో ఇప్పటికే 30 ఆక్సిజన్ పడకలు ఉండగా మరో 100 పడకలు, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో 70 ఆక్సిజన్ పడకల కోసం పైప్‌లైన్ ద్వారా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. శనివారం వరకు పనులు పూర్తవుతాయని చెప్పారు. దోమకొండ, మద్నూర్, ఎల్లారెడ్డి, బిచ్కుంద పీహెచ్‌సీల్లో 10 చొప్పున ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సూచనతో జిల్లా ఆస్పత్రిలో 5 వెంటిలేటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా వైద్యాధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు.