Minister KTR Election Campaign at Kama Reddy : సీఎం కేసీఆర్ వచ్చాక రాష్ట్రంలో 24 గంటల కరెంటు వస్తుందని.. గ్రామాల్లో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా అరాచకమే కనిపించిందని అన్నారు. బీడీ పరిశ్రమలో పనిచేసే మహిళలకు రూ.2 వేలు ఇస్తున్న ప్రభుత్వం తమదని హర్షించారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్ రోడ్‌షో(BRS Road Show)లో మంత్రి కేటీఆర్ పాల్గొని.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణకు సీఎంగా కేసీఆర్ వచ్చాకే రైతుబంధు(Rhythu Bandhu) వచ్చిందని.. 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు రైతుబంధు ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచుతామని మాటిచ్చారు. అన్నపూర్ణ పథకం కింద రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యం ఇస్తామని పునరుద్ఘాటించారు.
Minister KTR Road Show at Kama Reddy :బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు అనేది పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి(Revanth Reddy)కి కనిపించడం లేదా అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు అనుమాన పక్షులు వారికి అనుమానం ఎక్కువని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు తీగల మీద బట్టలు అరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేదని.. ఇవాళ కరెంటు వస్తుందో లేదో తెలుసుకోవాలంటే రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ వచ్చి కరెంటు తీగలను పట్టుకుంటే సరిపోతుందని ఎద్దేవా చేశారు.