తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Problems: రైతులను వీడని కష్టాలు.. కాంటా వేసేందుకు కాసుల వసూలు.. - paddy procurement in telangana

కామారెడ్డి జిల్లాలో అన్నదాతల కష్టాని(Farmers Problems)కి అంతులేకుండాపోతోంది. ఓ వైపు కొనుగోళ్ల(paddy procurement)లో జాప్యం.. మరోవైపు వరుణుడి ప్రతాపంతో రైతన్న అతలాకుతలం అయ్యాడు. ఇది చాలదన్నట్లు పైసలిస్తేనే తొందరగా కాంటా.... లేకుంటే లేదంటూ వేధిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

millers demanding money for fast paddy procurement at kamareddy
millers demanding money for fast paddy procurement at kamareddy

By

Published : Nov 19, 2021, 4:46 AM IST

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాతలు అతలాకుతలమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసిన ధాన్యం కళ్లముందే వరద కాలువల్లో కొట్టుకుపోయింది. ప్రకృతి ప్రకోపానికి తోడు ధాన్యం కొనుగోళ్లలో జాప్యం తమకు శాపంగా మారిందని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ కష్టాలు చాలవన్నట్లు డబ్బులు ఇస్తేనే ధాన్యం కాంటా వేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుకుబడి, రాజకీయ నాయకుల పైరవీలు ఉన్నవారికే ధాన్యం త్వరగా మిల్లులకు చేరుతోందని ఆరోపిస్తున్నారు. సదాశివనగర్ మండలంలో ధాన్యం సంచికి రూపాయి లేదా రెండు రూపాయలు లారీ డ్రైవర్‌కు ఇస్తే కాంటా వేసిన ధాన్యం తొందరగా మిల్లుకు తరలుతోంది. గాంధారిలో సొసైటీ డైరెక్టర్లకు డబ్బులు ఎవరిస్తే వారిది ముందు కాంటా పూర్తవుతోంది. కామారెడ్డి ఏరియాలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఫోన్ చేస్తే.... తేమశాతం రాకున్నా కాంటా వేస్తున్నారని... సాధారణ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. చిన్నమల్లారెడ్డి, సరంపల్లి తదితర ప్రాంతాల్లో 17 శాతం తేమ నిబంధనను కాదని.. 12శాతం తేమ వస్తేనే కాంటా వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రాల్లో సౌకర్యాల కొరత, తరుగు కష్టాలు షరా మమూలే అన్నట్లుగా ఉంది. జిల్లాలో ఒక్కో చోట ఒక్కో రకంగా తరుగు తీస్తూ రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నారు. సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి కేంద్రంలో తరుగు 1200 గ్రాములు తీస్తే.. కామారెడ్డిలో 1500 గ్రాములు తీస్తున్నారు. హమాలీ క్వింటాకు 34 రూపాయలు ఒకచోట.. 40 రూపాయలు మరోచోట తీసుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇష్టారీతిన కొనుగోళ్లు సాగుతున్నాయి.


కొనుగోలు కేంద్రాల తీరు, అధికారుల నిర్లక్ష్యం, అకాల వర్షాలతో విసిగిపోయిన రైతులు.... ఎంతో కొంతకు ధాన్యం మిల్లు చేరితే చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details