KTR Kamareddy District Tour : ఎల్లారెడ్డి నియోజక వర్గం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం రూ.45 కోట్ల నిధులను మంజూరు చేసిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అందులో రూ.25 కోట్లు స్థానికంగా విలువైన పనుల కోసం, మరో రూ.20 కోట్లు రోడ్లు, కొన్ని చోట్ల వంతెనలు కావాలని స్థానిక నాయకులు అడిగినందున ఆయా నిధులను మంజూరు చేశారని వివరించారు. రైతు బంధు అందుతున్న టాప్ 5 స్థానాల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గం ఉందని అన్నారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డిలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
KTR Tour in Kamareddy : కామారెడ్డి జిల్లాలో కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
KTR Comments on BJP and Congress : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పలు విమర్శలు చేశారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు.. గడప గడపకు కాంగ్రెస్ అంటూ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏదో చేస్తామంటూ తిరుగుతున్నారని అన్నారు. యాభై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఏం చేసిందని ప్రశ్నించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వస్తే జన్‌దన్ ఖాతాలో రూ.15లక్షలు వేస్తానన్న మోదీ ఇచ్చిన హమీ ఏమైందన్నారు. రూ.400 సిలిండర్ ధర పెరిగితే గగ్గోలు పెట్టి.. ఇపుడు రూ.1200 చేసిన మోదీని ఏం చేయాలన్నారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దిల్లిలో తాకట్టు పెట్టే కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని విమర్శించారు.
KTR Fire on Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలో రైతులకు మూడు గంటలే విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోసం బతిమాలుకున్న రోజులు మర్చిపోదామా? అని అడిగారు. ఏ పార్టీ అయినా.. కరెంట్ విషయంలో ఆలోచించాలని మంత్రి కోరారు. ఎల్లారెడ్డిలో చెరువులు, బోర్ల కిందనే సాగు ఎక్కువ చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌ని వచ్చే ఎన్నికల్లో 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.