Kamareddy Govt Degree College : సుదీర్ఘకాల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా దక్కింది. ఈ మేరకు తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో కళాశాలకు న్యాక్బృందం వచ్చింది. వివిధ విభాగాలను పరిశీలించిన అనంతరం 'ఏ' గుర్తింపును జారీచేసింది. కళాశాల స్వయంప్రతిపత్తికి అర్హత సాధించింది.
తాజాగా అన్ని అంశాలను పరిశీలించాక కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాకు యూజీసీ ఆమోదం తెలిపింది. తద్వారా కళాశాల అభివృద్ధికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉంది. 1964లో ఏర్పాటైన కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేటికీ వినూత్న కోర్సులతో రాష్ట్రంలోనే ప్రత్యేకతను చాటుతోంది. ఇప్పటికి రెండు సార్లు న్యాక్ గుర్తింపు దక్కింది. కళాశాలకు గతంలో న్యాక్ 'బి' గ్రేడ్ దక్కింది. ఈ అరుదైన గుర్తింపుతో జిల్లాలోనే ప్రథమ, రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. తాజాగా 'ఏ' గ్రేడ్‌తో గుర్తింపు సాధించి.. రాష్ట్రంలోనే రెండో కళాశాలగా నిలిచింది.
కళాశాలకు మెరుగైన గ్రేడ్ దక్కేందుకు ఆయా విభాగాల అధిపతుల సమష్టి కృషి దోహదపడింది. భవనాలకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. రాశివనం, చేపల కొలను, భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టారు. పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని నెలల ముందునుంచే ప్రణాళికబద్ధంగా వ్యవహరించారు. అనుకున్న లక్ష్యాన్ని అధిగమించారు.
Kamareddy Govt Degree College got NAAC A Grade : తాజాగా స్వయంప్రతిపత్తి ఉన్న కళాశాలగా మారడంపై విద్యార్థులు, కళాశాల వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇకపై నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మాదిరిగానే పరీక్షల నిర్వహణ స్వయంగా చేపట్టనున్నారు. రాష్ట్రంలోనే అరుదైన కోర్సులను ఈ కళాశాల అందిస్తోంది. బీఎస్సీ ఫారెస్ట్రీ, ఫిషరీస్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ అనలిటికల్ సైన్స్ వంటి భిన్నమైన కోర్సులు ఈ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ చదివిన ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. తాజాగా అటానమస్ గుర్తింపు రావడంతో విద్యార్థులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని అధ్యాపకులు భావిస్తున్నారు. కళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా దక్కడంతో.. యూజీసీ నిధులతో కళాశాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు వీలు కలుగుతుందని భావిస్తున్నారు.
అటానమస్ గుర్తింపు రావడానికి పూర్వవిద్యార్థులు, ఆయా విభాగాల బాధ్యులు, అధ్యాపకులు సహకరించారని.. కళాశాల అభివృద్ధి కోసం.. తనపై మరింత బాధ్యత పెరిగిందని ప్రిన్సిపల్ అంటున్నారు. అటానమస్ గుర్తింపు రావడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా అటానమస్ గుర్తింపు కోసం ఎదురు చూస్తుండగా.. హోదా దక్కడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కళాశాల అభివృద్ధికి మరింత దోహద పడుతుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: