Kamareddy farmers petition in TS HC : కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యపై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్‌పై ఉన్నత న్యాయస్థానంలో పలువురు కర్షకులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 500 మందికిపైగా రైతులు మున్సిపల్ కమిషనర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగిలిన రైతులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టుకు కామారెడ్డి రైతులు
06:04 January 07
మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టును ఆశ్రయించిన బాధిత రైతులు
Kamareddy Master Plan Issue : కామారెడ్డి పురపాలక సంఘానికి నూతన బృహత్ ప్రణాళికను రూపొందించే క్రమంలో.. పరిసర ప్రాంతాల్లోని 8 గ్రామాల్లో 2 వేల170 ఎకరాల సాగు భూములను పారిశ్రామిక జోన్‌లో చేర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ రెండ్రోజులపాటు రైతులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. మాస్టర్ ప్లాన్‌ను నిరసిస్తూ... రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నెల రోజులుగా ఆందోళనలు చేస్తుండగా... రెండ్రోజుల క్రితం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆందోళనలకు మరింత ఆజ్యం పోసినట్లైంది.
మరోవైపు రైతులు చేపట్టిన ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్‌లుపూర్తి మద్దతు ప్రకటించాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు కామారెడ్డికి 2 కాంగ్రెస్ బృందాలు తరలివెళ్లాయి. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ స్పష్టం చేశారు. మాస్టర్ ప్లాన్‌పై ప్రజాక్షేత్రంలో సభలు జరిపి రైతులతో చర్చించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరాయి.
మరణించిన రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించేందుకుబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డికి వెళ్లారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పారిశ్రామిక జోన్‌లో సాగు భూములు కలపొద్దని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ అకస్మాత్తుగా చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఉద్రిక్తత చెలరేగడంతో పోలీసులు బండి సంజయ్‌ను అరెస్టు చేసి ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, వెంకట్ రమణారెడ్డి సహా ఎనిమిది మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు.