హరితహారానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూన్ 20 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే అనుకున్న సమయానికి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈసారి పల్లెలు, మున్సిపాలిటీల్లో 65.20 లక్షల మొక్కలు నాటుతారు. గ్రామాల్లో గుంతలు తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా ఆయా ప్రభుత్వ శాఖలు హరితహారంలో భాగస్వాములవుతున్నాయి.
అంతర్గత రోడ్లు, ఖాళీ స్థలాలు
ఈ ఏడాది పల్లెల్లో అంతర్గత రోడ్లకు ఇరువైపులా మొక్కలు పెట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటుతారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రజలకు అవసరమైన మొక్కల వివరాలను అధికారులు సేకరించారు. వారి అభిరుచికి తగ్గట్లు వివిధ రకాల పండ్ల మొక్కలు అందజేస్తారు. వీటి పర్యవేక్షణ బాధ్యత ఇంటి యజమానులే చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ప్రతి గ్రామానికి 40 వేల మొక్కల లక్ష్యం విధించేవారు. అనుకున్న లక్ష్యం అందుకోక, చాలా మొక్కలు వృథా కావడంతో ప్రభుత్వం పంచాయతీల తీర్మానాల ప్రకారమే నిర్ణయింపజేసింది. పంచాయతీల ఆధ్వర్యంలో నర్సరీలను కూడా ఏర్పాటు చేసి నిర్వహణ బాధ్యతలు అప్పగించింది.