తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజాంసాగర్ నిండా నీళ్లు.. అయినా.. కర్షకుల కళ్లలో కన్నీళ్లు - Kamareddy district farmers issues

ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడం వల్ల నిజాంసాగర్ జలాశయం జలకళ సంతరించుకుంది. నీళ్లున్నాయనే భరోసాతో యాసంగి పంటకు రైతులంతా సిద్ధమయ్యారు. కానీ.. ప్రాజెక్టు కాల్వలు, కల్వర్టుల నిర్మాణాలు శిథిలావస్థకు చేరడం, పలుచోట్ల పగుళ్లు ఏర్పడటం వల్ల తమ పొలాలకు నీరందుతుందో లేదోనని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.

nizam sagar dam canal repairs
నిజాంసాగర్ నిండా నీళ్లు.. అయినా.. కర్షకుల కళ్లలో కన్నీళ్లు

By

Published : Dec 6, 2020, 1:35 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో నిజాంసాగర్​ పూర్తి ఆయకట్టు 1.15 లక్షల ఎకరాల్లో ఉంది. సాగర్​కు 1 నుంచి 82 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, 1200 ఉప కాలువలున్నాయి. 2008లో ప్రధాన కాలువల ఆధునీకరణకు రూ.549.60 కోట్లు, 2016లో నిజాంసాగర్ ఉపకాలువల కోసం రూ.11.255 కోట్లు, అదే ఏడాది మరోసారి 96.69 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో సైడ్​ వాల్​ కల్వర్టులు, తూములు నిర్మించారు. నిర్మాణాల్లో నాణ్యత లోపించడం వల్ల కొన్నిచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. దీనివల్ల సాగర్ నీరు వదిలినప్పుడు చివరి ఆయకట్టు వరకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

నీరు పారదు.. పంట పండదు

ఈ ఏడాది కామారెడ్డి జిల్లా వర్షాలు సమృద్ధిగా కురిశాయి. నిజాంసాగర్ జలాశయం నిండుకుండలా మారడం వల్ల పంటకు ఢోకా లేదని రైతులు.. యాసంగికి రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ.. కాలువలు, తూములకు పగుళ్లు ఏర్పడటం వల్ల తమ పంట పొలాలకు నీరందుతుందో లేదోనని చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరమ్మతులు చేసి నీరందేలా చూడాలని కోటగిరి మండలం శేషాద్రిపురం, కొల్లూరు, కారేగంమ్, దోమలెడ్గి గ్రామాల ఆయకట్టు రైతులు అధికారులను కోరుతున్నారు.

మరమ్మతులు చేయించండి

పలు ప్రాంతాల్లోని ఉపకాలువలు చెత్తాచెదారం, మట్టితో నిండి.. సాగర్​ నుంచి వదిలిన నీరు తమ వరకు రాకుండా అడ్డుగా మారుతున్నాయని, మధ్యలోనే నీరంతా వృధాగా పోతోందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువలు శుభ్రం చేసి, శిథిలావస్థకు చేరుకున్న కాలువలకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details