తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వం సన్నద్ధం: వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రత్యేక ప్రణాళిక - kamareddy district latest news

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవర పెడుతోంది. ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. వైద్య నిపుణుల కృషితో వ్యాక్సిన్‌ తయారై పంపిణీకి సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకా పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాలనాధికారి శరత్‌ పేర్కొన్నారు. అందుకు రూపొందించిన కార్యాచరణతో పాటు కొత్త సంవత్సరంలో సంక్షేమ పథకాల అమలు తీరుపైౖ ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

kamareddy collector corona vaccine distribution
వ్యాక్సిన్‌ పంపిణీకి సర్వం సిద్ధం

By

Published : Jan 1, 2021, 9:21 PM IST

రెండో దశ పంపిణీకి ప్రత్యేక ప్రణాళిక

మూడు విశాలమైన గదులున్న భవనాల్లో రెండో దశ టీకాల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కమ్యూనిటీ భవనాలు లేదా పాఠశాల భవనాలను ఎంపిక చేయనున్నాం. టీకా తీసుకున్న అనంతరం అరగంట వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాం. మార్గదర్శకాలు విడుదల కాగానే వ్యాక్సిన్‌ ఇచ్చే భవనాలను గుర్తించే ప్రక్రియను పూర్తి చేస్తాం.

జిల్లాలో కరోనా నిర్ధారిత పరీక్షలు లక్షకు పైగా చేశాం. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రితో పాటు బాన్సువాడ దవాఖానాలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నాం. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజుకు 500లకు తగ్గకుండా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం.

వ్యాక్సిన్‌ పంపిణీకి సర్వం సిద్ధం

పర్యవేక్షణకు కమిటీలు

వ్యాక్సిన్‌ పంపిణీని పక్కాగా చేపట్టేందుకు జిల్లా, డివిజన్‌, మండల స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే జిల్లా స్థాయి కమిటీ మొదటి సమావేశం నిర్వహించాం. మొదటి దశలో టీకా పంపిణీ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించాం. అందుకనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెండు డోసులుగా..

కరోనా వైరస్‌ నియంత్రణ వ్యాక్సిన్‌ను నిర్దేశిత వ్యక్తులకు రెండు డోసులలో పంపిణీ చేయనున్నాం. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ అనంతరం 14 నుంచి 28 రోజుల ఎడం ఇచ్చి రెండో డోస్‌ పంపిణీ చేయనున్నాం. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

రోజుకు వంద మందికి...

నిర్దేశిత కేంద్రాల్లో రోజుకు వంద మందికి వ్యాక్సిన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందులో భాగంగా 41 మంది వైద్యులకు, 252 మంది ఏఎన్‌ఎంలకు, 25 మంది స్టాఫ్‌నర్సులకు శిక్షణిచ్చాం. ప్రతి వ్యాక్సిన్‌ కేంద్రంలో ఇద్దరు వైద్యులు టీకాలు ఇవ్వనున్నారు.

మొదటి దశ ఆరోగ్యకేంద్రాల్లో

మొదటి దశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలతో పాటు రెండు పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో అందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి నేరుగా వ్యాక్సిన్‌ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు సరఫరా జరుగుతుంది.

కొత్తరకం కరోనాపై ఆందోళన వద్దు

కొత్తరకం కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు కొత్త వైరస్‌ నిర్ధారణ జరిగిన వాళ్లు జిల్లాలో లేరు. వారం రోజుల కిందట లండన్‌ నుంచి ఇక్కడికి వచ్చిన ఇద్దరికి కరోనా నెగెటివ్‌ వచ్చింది. ఎవరైనా ఇతర దేశాల నుంచి వస్తే జిల్లా వైద్యశాఖకు సమాచారం ఇచ్చి సహకరించాలి. చేతులు శుభ్రం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలి.

పోర్టల్‌లో వివరాల ఆధారంగానే..

వ్యాక్సిన్‌ ఇచ్చేవారి వివరాలను వైద్యశాఖ ప్రత్యేకంగా పోర్టల్‌లో నమోదు చేస్తోంది. ఆయా వివరాల ఆధారంగానే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నాం. ముందుగానే నిర్దేశిత వ్యక్తి చరవాణికి సందేశం రానుంది. దీని ఆధారంగానే కేంద్రంలో వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

సంక్షేమ పథకాలు దరిచేరేలా

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా వ్యాప్తి తగ్గితే డివిజన్‌ కేంద్రాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు చర్యలు చేపడతాం.

మూడు దశల్లో...

ప్రజలందరికి మూడు దశల్లో వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం మొదటి దశ పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు మాత్రమే విడుదలయ్యాయి. మొదటి దశలో ఫ్రంట్‌లైన్‌ కరోనా వారియర్స్‌ ( ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల సిబ్బందితో పాటు పోలీస్‌, పురపాలక శాఖల సిబ్బంది)కి వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తాం. ఇందులో మొదటగా వైద్యసిబ్బందికి టీకాలు వేయనున్నాం. తదనంతరం పోలీస్‌, పురపాలక సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తారు. రెండో దశలో 50ఏళ్లు పైబడిన వారికి, మూడో దశలో 16 సంవత్సరాలకు పైబడిన, 50 సంవత్సరాలకు లోబడిన వారందరికి ఓటరు జాబితా ఆధారంగా పంపిణీ చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. 16 ఏళ్లలోపు యువత, పిల్లలకు వ్యాక్సిన్‌ పంపిణీ లేదని వైద్యశాఖ నిర్దేశించింది. టీకా పంపిణీకి సంబంధించిన తేదీలు ఖరారు కావాల్సి ఉంది.

ఏఈఎఫ్‌ఐ కిట్లు

కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే కేంద్రాల్లో ఏఈఎఫ్‌ఐ(అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌) కిట్లను అందుబాటులో ఉంచనున్నాం. ముఖ్యంగా వ్యాక్సిన్‌ వేసిన తదనంతరం ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఎదుర్కొనేందుకు వీటిని సిద్ధంగా ఉంచుతున్నాం. జిల్లాకేంద్ర ఆసుపత్రిలో ఐదుగురు వైద్యనిపుణులను వ్యాక్సిన్‌ సమయంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశాం. బాన్సువాడ ప్రాంతీయ దవాఖానాలో ముగ్గురు వైద్యనిపుణులతో కూడిన బృందాన్ని అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాం. వీరు వ్యాక్సిన్‌ తిరగదోడిన వారికి చికిత్స చేయనున్నారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో నాలుగు, మహబూబ్‌నగర్‌లో మూడుచోట్ల డ్రైరన్‌

ABOUT THE AUTHOR

...view details