తెలంగాణ

telangana

ETV Bharat / state

పురుగుల అన్నం, నీళ్ల చారు... కస్తూర్బా పాఠశాలలో మెనూ! - పురుగుల అన్నం, నీళ్ల చారు... కస్తూర్బా పాఠశాలలో మెనూ!

పురుగుల అన్నం, పుచ్చుల కూరలు, నీళ్ల చారు, వారంలో ఓసారి రెండు ముక్కల చికెన్... ఇదే కామారెడ్డి జిల్లాలోని మద్నూరు కస్తూర్బా విద్యాలయంలోని మెనూ...! అన్నం తిందామని ప్లేట్​లో భోజనం పెట్టుకుంటే... అది చూసి ఆకలి చచ్చిపోవటమే కాదు... వాంతి కూడా చేసుకుంటున్నారు ఆ విద్యార్థులు.

INFERIOR MEAL IN MADNURU KASTURBA SCHOOL
INFERIOR MEAL IN MADNURU KASTURBA SCHOOL

By

Published : Dec 18, 2019, 5:46 PM IST

దేవుడు కరుణించినా... గుడిలో పూజారి కరుణించలేదు అన్నట్లుగా మారింది కస్తూర్బా విద్యాలయాల పరిస్థితి. సీఎం కేసీఆర్​ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పేద పిల్లల కోసం ఖర్చు చేస్తున్న సర్కారు సొమ్ముకు అవినీతి, నిర్లక్ష్యం చీడ పట్టింది. అధికారుల పర్యవేక్షణ లోపం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో పెద పిల్ల అన్నం పురుగుల పాలవుతోంది.
కామారెడ్డి జిల్లా మద్నూరులోని కస్తూర్బా పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతూ... విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. 200 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ విద్యాలయంలో... పిల్లలూ మూడు పూటల్లో ఏ ఒక్క పూట కూడా కడుపునిండా తినలేక పస్తులుంటున్నారు. ఎంతో ఆకలితో వచ్చిన విద్యార్థులు ప్లేట్లో భోజనం పెట్టుకుంటే... పురుగుల అన్నం, పుచ్చుల కూరలు సాక్షాత్కరిస్తున్నాయి. ఆకలి మాట దేవుడెరుగు... అది చూస్తేనే వాంతులు చేసుకుంటున్నారు పిల్లలు.

రోజూ పస్తులే...

పురుగుల బియ్యం, ఉడికి ఉడకని అన్నం, నీళ్ల చారు పెడుతుండడం వల్ల తినలేకపోతున్నామని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని... ఆ పెట్టేది కూడా నాసిరకంగా ఉంటోందన్నారు. 'ఈనాడు- ఈటీవీ భారత్​' పరిశీలనలో ఈ విషయం బట్టబయలైంది. వారానికోసారి పెట్టే చికెన్​ కూడా... ఒకటి, రెండు ముక్కలేసి మిగితాది ఉపాధ్యాయులు డబ్బాల్లో ఇంటికి తీసుకెళ్లి తింటున్నారని విద్యార్థులు వాపోయారు. ప్రిన్సిపాల్​ తమను అస్సలు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులు, స్పందించి భోజనం సక్రమంగా పెట్టేలా చర్యలు తీసుకోవాలని బాలికలు కోరుతున్నారు.

పురుగుల అన్నం, నీళ్ల చారు... కస్తూర్బా పాఠశాలలో మెనూ!

ఇవీ చూడండి: 'గొర్రెల పంపిణీ తక్షణమే ఆపండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details