SAND TRANSPORT: రోడ్లపై ఏకధాటిగా తిరుగుతున్న లారీలు.. దెబ్బతిన్న రహదారులు.. రోడ్డును ఆనుకొని పెద్ద పెద్ద ఇసుక కుప్పలు. ఇది కామారెడ్డి జిల్లా మద్నూర్, బిచ్కుంద మండలాల్లో కనిపిస్తున్న దృశ్యాలు. కుర్లా, ఖత్‌గావ్ గ్రామ సమీపంలోని మంజీరా నుంచి నిత్యం వందలాది లారీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎండాకాలంలో ఇక్కడ ప్రభుత్వ అనుమతులతో భూగర్భజలశాఖ అధికారులు ఇసుకక్వారీలు నడిపించారు.
రెండునెలల క్రితం అవి నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. వేసవిలో మంజీరాలో ఉన్న ఇసుక మొత్తాన్ని అక్రమార్కులు రోడ్డు పక్కన ఖాళీ స్థలాల్లో కుప్పలుగా పోశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక దందా సాగిస్తున్నారు. పరిమితికి మించి బరువుతో నిత్యం వందలాది లారీలు.. మద్నూర్, బిచ్కుంద మండలం కుర్లా, ఖత్‌గావ్ నుంచి డోంగ్లీ, మోగా, మేనూర్ గ్రామాల మీదుగా హైదరాబాద్, కర్ణాటక, మహారాష్ట్రకు తరలిస్తున్నారు.