ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి విస్తారంగా వానలు పడుతున్నాయి. వరదల ప్రవాహానికి పంటలు ఎక్కడికక్కడ నీట మునిగాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి పంటలు గాలివానకు నేలవాలాయి. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి పడ్డాయి.
కామారెడ్డిలో జోరు వానలు... నీట మునిగిన పంటలు - telangana rains details
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు కామారెడ్డి జిల్లాలో పంటలు నీట మునిగి... రైతన్నకు తీరని నష్టం మిగిల్చాయి. పలు చోట్ల రోడ్లు దెబ్బదిని రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎక్కడికక్కడ వాగులు ప్రవహిస్తూ... జనజీవనం స్తంభించిపోయింది.
![కామారెడ్డిలో జోరు వానలు... నీట మునిగిన పంటలు heavy rains in kamareddy... heavy loss of crops](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9171898-298-9171898-1602669496226.jpg)
కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం తుజాల్పూర్లో భారీ వర్షాలకు చెట్టు కూలి ఓ గేదె చనిపోయింది. మండల సరిహద్దులోని కూడవెళ్లి వాగు వంతెన పైనుంచి అలుగు పారుతోంది. దీని ప్రభావంతో సిద్దిపేట జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగంపేట మండలంలో ఎక్కపల్లి చెరువు అలుగు పారుతోంది. రామారెడ్డి మండలం ఉప్పల గ్రామంలో రహదారిపై చెట్టు నేలకూలడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి చెరువు తూముకు గండి పడి నీరు వృథాగా పోతుండటం వల్ల గ్రామస్థులు మరమ్మతులు చేశారు. లింగంపేట మండలం ఎక్కపల్లిలో వరి పంటలు నీట మునిగాయి. తాడ్వాయి మండల వ్యాప్తంగా వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి, చెరుకు పంటలు నేలవాలిపోగా.. పత్తి పూర్తిగా రాలిపోయింది. నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది.