ఉమ్మడి నిజామాబాద్ (Union Nizamabad) జిల్లా వాప్తంగా జోరుగా వర్షాలు (Rains)కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం అస్తవస్తమవుతోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని మాలపల్లి, అర్సపల్లి ప్రాంతాలు వరదతో నిండిపోయాయి. రోడ్లన్నీ నీటితో నిండిపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కంటేశ్వర్ రైల్వే కమాన్ స్తంభించిపోయింది. వర్షం వల్ల వరద నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాలను వరద ముంచెత్తింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీట మునిగిపోయాయి.
కామారెడ్డి జిల్లాలోనూ...
కామారెడ్డి జిల్లాలోనూ వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. జుక్కల్ నియోజకవర్గంలో మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో వాగులు పొంగి రోడ్లు తెగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. పిట్లం మండలం తిమ్మనగర్ నుంచి మెదక్ జిల్లాకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన పక్కన మట్టి కొట్టుకుపోవడం వల్ల ఇరు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
జుక్కల్ మండలం నాగల్గావ్ సమీపంలో వాగుపై ఉన్న వంతెన వద్ద వరద ఉద్ధృతికి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మద్నూర్ మండలం డోంగ్లి నుంచి మాధన్ హిప్పర్గకు వెళ్లే మార్గలో వంతెన వద్ద భారీగా వరదనీరు రావడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. మద్నూర్ మండలం మాధన్ హిప్పర్గ వాగుకు భారీగా వరద నీరు వచ్చి గ్రామంలోకి నీరు వచ్చి చేరింది. బిచ్కుంద మండలం రాజుల్లా మధ్యలో వంతెన వద్ద భారీగా వరద నీరు వచ్చి అర కిలోమీటర్ మేర రోడ్డు కోతకు గురైంది. బిచ్కుంద మండలం గుండె కల్లూర్ గ్రామం చుట్టు వరద నీరు చేరడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని చెరువులు, వాగులు నిండి అలుగు పారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
శ్రీరాంసాగర్కు జలకళ...
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వేగంగా నిండుతోంది. ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,090 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులో 1,079.80 అడుగుల మేర నీటిమట్టం ఉండగా సుమారుగా 60 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం వల్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: BOGATHA WATERFALLS: ఉరకలెత్తుతున్న బొగత జలపాతం.. అందాలు చూసొద్దామా.!