తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యుల పట్ల హేళన చేస్తూ.. మాట్లాడటం తగదు: ఈటల

వైరస్ బాధితులకు సేవలు అందించడంలో వైద్యుల పాత్ర ఎనలేనిదన్నారు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైద్యుల పట్ల హేళన చేస్తూ.. మాట్లాడటం తగదు: ఈటల
వైద్యుల పట్ల హేళన చేస్తూ.. మాట్లాడటం తగదు: ఈటల

By

Published : Jul 26, 2020, 4:51 PM IST

కరోనా నివారణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైరస్ బాధితులకు సేవలు అందించడంలో వైద్యుల పాత్ర ఎనలేనిదని చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యులు, అధికారుల నుంచి సలహాలు స్వీకరించారు. జిల్లాలో 11 మంది ల్యాబ్ టెక్నీషియన్స్, 5 ఫార్మసిస్ట్స్, 68 ఎంపీహెచ్ఎస్ మహిళ సిబ్బంది, సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ఏర్పాటు, మాత శిశు సంరక్షణ ఆస్పత్రికి రూ. 5 కోట్లు మంజూరు చేయాలని కలెక్టర్ శరత్ కుమార్ మంత్రిని కోరారు. జిల్లాలోని దోమకొండ, బాన్సువాడ, ఎల్లారెడ్డి ఆస్పత్రులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్స్ చెడిపోయిందని.. అదనంగా అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని వైద్యులు కోరారు. బాన్సువాడలో ఔట్ సోర్సింగ్ వైద్యులను రెగ్యులర్ చేయాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరారు. జిల్లాలో వైద్యుల సమస్యలను తెలుసుకోవడానికి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టుల సంఖ్య పెంచినట్లు మంత్రి వెల్లడించారు. వైరస్ బారిన పడిన వారిని హోం ఐసోలేషన్ పంపే ముందు ఇంట్లో ఉన్నవారి పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.

హేళన తగదు..

ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యుల పట్ల హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వైద్యులు మనోధైర్యంతో పని చేయాలని, వైద్యులకు ఎలాంటి వసతులు కావాలన్నా సమకూర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ శరత్ కుమార్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్, జడ్పీ ఛైర్మన్ దఫెదర్ శోభ, డీఎంఈ రమేష్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ జాహ్నవి, అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details