గోమయ గణపయ్య... పర్యావరణానికి మేలయ్య కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన శ్రీనివాస్ వృత్తిరీత్యా న్యాయవాది. గోవులను రక్షించేందుకు ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నాడు. వినాయక చవితి పురస్కరించుకుని పర్యావరణానికి హితంగా ఉండేలా ఆవు పేడతో గణేశ్ ప్రతిమలను తయారు చేయడం ప్రారంభించాడు. ఆ ప్రతిమలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాలుష్య రహిత పర్యావరణంపై చైతన్యం కలిగిస్తున్నాడు.
గోమయ ఉత్పత్తులు
గోసంరక్షణతో పాటు గోమయంతో పలు రకాల ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నాడు. ఇప్పటివరకు టోపి, ఇంట్లో అలంకరణ వస్తువులు, రేడియేషన్ స్టిక్కర్లు, వెంకటేశ్వర స్వామి, హనుమాన్ విగ్రహాలు రూపొందించారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్ అన్నారు.
కాలుష్యరహిత బాన్సువాడ
ఇతర గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి గోమయ గణపతులను కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఇక్కడి నుంచి ప్రతిమలు తీసుకువెళ్లి తమ ఊళ్లలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పర్యావరణహితమైన విగ్రహాలు వినియోగించి బాన్సువాడను కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని స్థానికులు చెబుతున్నారు.