మరుగుదొడ్ల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారబోయడం వల్ల దుర్వాసన వెదజల్లుతూ పర్యావరణం కలుషితమవుతోంది. ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని చూపాలని స్థానికులు కోరగా.. కామారెడ్డి పురపాలిక అధికారులు ఓ అద్భుత పరిష్కారం చూపారు. మరుగుదొడ్ల వ్యర్థాలను ఎరువుగా మలిచేందుకు పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం ఏర్పాటు చేశారు. ఈ ఎరువును హరితహారంలో నాటిన మొక్కలకు వేసేందుకు కార్యచరణ మొదలుపెట్టారు. ఇంకా ఎక్కువ ఎరువు ఉత్పత్తి అయితే రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపారు.
పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం
కేంద్ర ప్రభుత్వం, ఎన్జీటీ కలిసి స్వచ్ఛ భారత్లో భాగంగా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. అనంతరం మరో 6 మున్సిపాలిటీలను ఎంపిక చేసి పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అందులో కామారెడ్డి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీపీని కోటిన్నర రూపాయలతో నిర్మించారు. మొదటగా సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ తెచ్చే వ్యర్థాల్ని ఒక చాంబర్లో పోసి అనంతరం పలు దఫాలుగా నీటిని వేరుచేసి మెత్తటి మట్టిలాంటి ముద్దను ఒక చాంబర్ ద్వారా సోలార్ ప్యానెల్స్ ఉన్న రూంలోకి పంపుతారు. నీటిని మూడు దఫాలుగా శుద్ధి చేసి చెట్లకు పోసేందుకు ఉపయోగిస్తారు. ఈ ఉద్యానవన పర్యవేక్షణను సీడీఎంఏ చూస్తుంది.