కామారెడ్డి జిల్లా భిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు తండ్రీకుమారుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. తమ భూమిని సోదరులు కబ్జా చేసి రైతుబంధు, కొత్త పాస్ పుస్తకాలు రాకుండా చేస్తున్నారని పురుగుల మందు తాగారు. బాధితులను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
Suicide attempt: అన్నదమ్ముల భూ తగాదా.. తండ్రి, కొడుకు ఆత్మహత్యాయత్నం
తమ భూమిని కబ్జా చేసి రైతుబంధు, కొత్త పాస్ పుస్తకాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తండ్రి, కుమారులు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకుంది.
కంచర్ల గ్రామానికి చెందిన పెంజర్ల మల్లారెడ్డికి గ్రామ శివారులో 5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తన సోదరులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2018 లో మల్లారెడ్డికి చెందిన 2 ఎకరాల స్థలాన్ని కుమారుడు నితిన్‌రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. నితిన్‌రెడ్డి, మల్లారెడ్డి పేరు మీద కొత్త పాస్ పుస్తకాలు రాకుండా రాంరెడ్డి, లక్ష్మారెడ్డి అధికారులకు లంచం ఇచ్చారని బాధితులు ఆరోపించారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు తండ్రీ, కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.