తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers protest: 'మనిషికో పురుగుల మందు డబ్బా ఇవ్వండి.. ప్రశాంతంగా సచ్చిపోతాం' - kamareddy Farmers protest

Farmers protest: 'ఒక్కొక్క రైతుకు ఒక్కొ పురుగుల మందు డబ్బా.. ఓ ఉరి తాడు ఇవ్వండి. ప్రశాంతంగా చచ్చిపోతాం. లేదంటే మేము ధాన్యం పండిస్తాం.. మీరు ఫ్రీగా తీసుకోండి. పండించిన ధాన్యాన్ని తరుగు పేరుతో దోచుకుంటే మేము బతికుండి కూడా దండగే..' అంటూ అన్నదాతలు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

Farmers protest for millers fraud at palvancha
Farmers protest for millers fraud at palvancha

By

Published : Dec 14, 2021, 8:33 PM IST

Farmers protest: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచలో కర్షకులు రోడెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యాన్ని రైస్ మిల్లులో క్వింటాలుకు 12 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని ఆరోపిస్తూ అన్నదాతలు సిరిసిల్ల- కామారెడ్డి రహదారిపై బైఠాయించారు. రోడ్డుపై అడ్డంగా కంచె వేసి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం చెప్పినట్టుగా ఒకటిన్నర కిలోల తరుగు తీయడం లేదని.. రైస్ మిల్లర్లు నిలువునా దోపిడీ చేస్తున్నారని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 40 కిలోల ధాన్యం బస్తాకు 3 నుంచి 4 కిలోలు తరుగు తీస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటాలుకు దాదాపు 12 కిలోల తరుగు పోతుందన్నారు.

దిక్కులేక సచ్చిపోతున్నాం..

"మాకు ఇదంత బాధ ఎందుకు..? ధాన్యం మొత్తం ఫ్రీగా తీసుకోండి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. లేదంటే మనిషికి ఒక పురుగుల మందు సీసా, ఉరి తాడు ఇవ్వండి. ప్రశాంతంగా సచ్చిపోతాం. అప్పుడు మా మృతదేహాల మీద మంచిగా దోచుకోవచ్చు. ఇంత ఇబ్బంది పెట్టుడు ఎందుకు. ప్రభుత్వ ఉద్యోగులు, పొలిటికల్ లీడర్లు అందరూ బాగానే ఉన్నారు. మరి రైతులు మాత్రం ఏం పాపం చేశారు. 6 నెలలు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనడానికి.. మనసు రావటం లేదు. తినడానికి తిండి లేదు. పంటలో లాభము లేదు. ఎక్కడికక్కడ దిక్కు లేక సచ్చిపోతున్నాం. అధికారులు వచ్చి చూసుకుంటాం అంటారు. ధాన్యాన్ని త్వరగా పంపిస్తామంటారు. ఇక్కడ మాత్రం ఇన్నిన్ని కిలోల తరుగు తీసేస్తే మేమేం కావాలి." అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా న్యాయం చేయండి..

ఇప్పటికైనా తమ బతుకుల గురించి ఆలోచించి న్యాయం చేయాలని రైతులు కోరారు. లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడానికైనా తాము సిద్ధమని హెచ్చరించారు. ఇటీవల ధర్నా చేస్తే.. అధికారులు వచ్చి అన్ని చూసుకుంటామని చెప్పి ఇప్పుడు ఇలా దోచుకుంటున్నారని వాపోయారు. తమకు వ్యవసాయం తప్ప బతకడానికి వేరే ఆధారాలు లేవని.. దాన్ని కూడా ఇలా దోచేసుకుంటే ఎలా అని మండిపడ్డారు.

సుమారు రెండు గంటల పాటు రైతులు రాస్తారోకో చేయటం వల్ల రహదారిపై ఇరువైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్, పోలీసులు వచ్చి తరుగు తీయకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details