కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఇస్రోజివాడి ప్రాథమిక పాఠశాలలో 135 మంది విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదిన్నరగా ప్రత్యక్ష బోధన లేకపోవడంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పడిపోతుంది. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఉపాధ్యాయులకు అర్థమైంది. పేద విద్యార్థులకు టీవీలు, స్మార్ట్ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో ఆన్‌లైన్ తరగతులకు అంతంత మాత్రంగానే హాజరవుతున్నట్లు గుర్తించారు. వీరి ఇబ్బందులను తొలగించాలంటే ప్రత్యక్ష తరగతులే పరిష్కారమని భావించారు. అయితే కొవిడ్ కారణంగా పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో బోధించలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఓ సరికొత్త ఆలోచన చేశారు. విద్యార్థులకు పాఠశాలలో కాకుండా ఇంటి దగ్గరే ప్రత్యక్ష బోధన అందేలా చర్యలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థుల సహకారంతో ఒకరు మరో ఐదు మందికి బోధించాలంటూ నూతన పంథాకు శ్రీకారం చుట్టారు.
నాకు పాఠశాలకు వెళ్లడం అంటే ఇష్టం. కరోనా రావడం వల్ల వెళ్లలేకపోతున్నాను. స్కూలుకు వెళ్లే సమయంలో నాకు పది ఎక్కాలు వచ్చు. కానీ కరోనా సమయంలో అక్క వాళ్ల దగ్గరకి వెళ్లి చదువుకోమని మా టీచర్స్ చెప్పారు. రోజూ నేను తరగతులు వింటున్నాను. ఇప్పుడు నేను 20 ఎక్కాలు నేర్చుకున్నాను.
-విద్యార్థిని
ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గ్రామంలో మూడ్రోజుల పాటు తిరిగి... పూర్వ విద్యార్థులను సమీకరించారు. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు, చదువుకున్న గృహిణులు, వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులు.. ఇలా విద్యావంతులై గ్రామంలోనే ఉన్న వారిని కలిశారు. రోజుకో గంట సమయం కేటాయించి చిన్నారులకు బోధించాలని కోరగా... 22 మంది ముందుకొచ్చారు. ఒక్కొక్కరికి ఐదు నుంచి ఎనిమిది మంది విద్యార్థులను కేటాయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అక్షరాలు నేర్పించాలని సూచించారు. ఒక వీధికి సంబంధించిన విద్యార్థులను అదే ప్రాంతంలోని వాలంటీర్ బోధించేలా ఏర్పాట్లు చేశారు. ఇలా గ్రామంలో వీధికో బడి ఏర్పడింది. ఇంటి ముందు అరుగుల మీద, అనువైన స్థలంలో నెల రోజుల నుంచి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగుతోంది. ఏ రోజు ఏం బోధించాలనే దానిపై పూర్వ విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. వారం రోజులకోసారి నేర్చుకున్న అంశాలపై రాతపరీక్షలు నిర్వహించి అభ్యసన ప్రగతిని సమీక్షిస్తున్నారు. ప్రత్యక్షంగా పాఠాలు చెప్పడం వల్ల పాఠశాలకు వెళ్లినట్లే అనిపిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. తమవంతు సాయంగా పాఠాలు చెప్పడం సంతోషంగా ఉందని వాలంటీర్లు పేర్కొంటున్నారు.