Begging For Father's Funeral : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌కు చెందిన ఒంటెద్దు దుర్గయ్య కూలీ. పాములు పట్టడం వ్యాపకం. ఆయనకు కుమార్తె రాజేశ్వరి, కుమారుడు కాశీరాం ఉన్నారు. భార్య కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించింది. కుమార్తె గతేడు పదో తరగతి పూర్తిచేసింది. అప్పట్నుంచి ఆమెను బంధువుల ఇంట్లో ఉంచిన దుర్గయ్య ..పదిహేనేళ్ల కుమారుడితో కలిసి ఊరి చివరన గుడిసెలో నివసిస్తున్నాడు.
నాన్న మరణం.. యాచనే శరణం - భిక్కనూరులో తండ్రి అంత్యక్రియల కోసం భిక్షాటన
Daughter Begging For Father's Funeral : అనేక సందర్భాల్లో పాముల బారి నుంచి గ్రామస్థులను కాపాడిన వ్యక్తి ఓ పామును పట్టే క్రమంలోనే చనిపోగా, ఆయన అంత్యక్రియల సొమ్ము కోసం కుమార్తె భిక్షాటన చేయాల్సి వచ్చిన విషాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌లో చోటుచేసుకుంది.
![నాన్న మరణం.. యాచనే శరణం Daughter Begging For Father's Funeral](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15676079-408-15676079-1656385323863.jpg)
గ్రామంలో ఎవరింట్లోకి పాము వచ్చినా దుర్గయ్యకు సమాచారమివ్వడం, ఆయన పట్టుకుని అటవీ ప్రాంతంలో వదలడం ఆనవాయితీ. ఆదివారం ఓ కాలనీలో పాము సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నాడు. సంచిలో వేస్తుండగా పాము చేతిపై కాటు వేయడంతో మరణించాడు. శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని సోమవారం గ్రామానికి తీసుకొచ్చారు.
దహన సంస్కారాలకు డబ్బుల్లేని పరిస్థితుల్లో బంధువులు వైకుంఠ రథం మాత్రం సమకూర్చారు. ఇతర ఖర్చులకు సొమ్ముల్లేకపోవడంతో రాజేశ్వరి అంతిమయాత్రలోనే జోలె పట్టి యాచించడం కలచివేసింది. అండగా ఉన్న నాన్న కూడా మరణంతో తాము అనాథలమయ్యామని అక్కాతమ్ముళ్లు కన్నీటిపర్యంతమయ్యారు.