New Trends in Cyber Crime in Kamareddy : సైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ప్రజలకి ఎంత అవగాహన కల్పిస్తున్నా, రోజుకి వందల మంది సైబర్ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలను తెరిచి తెలిసిన వారందరికీ రిక్వెస్టులు పంపి డబ్బులు అడుగుతారు. అత్యవసరం అని అనడంతో తెలిసిన వాడే కదా అని స్నేహితులు, బంధువులు, సహచరులు డబ్బులు చెప్పిన అకౌంట్‌లో జమ చేస్తున్నారు. ఆ తర్వాత అది ఫేక్ అకౌంట్ అని సదరు వ్యక్తి చెప్పినప్పుడు మోసపోయాం అని గ్రహిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇలాంటి పనులతో డబ్బులు కాజేసిన సైబర్ మోసగాళ్లు తాజాగా కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. ఉన్నతాధికారులు, ఏసీబీ అధికారులమని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.
Continuous Cyber Crimes in Kamareddy : కామారెడ్డి జిల్లాలోసైబర్ నేరగాళ్లు చేసిన నయా మోసాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కామారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల పేర్లతో సైబర్ మోసగాళ్లు చాటింగ్ చేస్తున్నారు. ముందుగా పరిచయం చేసుకుని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత అత్యవసరం ఉందని డబ్బులు పంపాలని అడుగుతున్నారు. కొందరికి నేరుగా ఫలానా అధికారినంటూ వాట్సప్ కాల్స్ చేసి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు.
సైబర్ మోసాల మీద అవగాహన ఉన్నవారు జాగ్రత్త పడి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నిజమేనని అనుకుంటున్న ఉద్యోగులు మాత్రం చెప్పిన ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. గత పదిహేను రోజుల కింద ఇలాగే డబ్బులు అడగడంతో డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి రూ.2 లక్షలు ఇచ్చేశాడు. గత రెండు రోజులుగా మళ్లీ ఇలాగే కాల్స్ వస్తుండటంతో అనుమానం వచ్చిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలంతా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.