లాక్డౌన్లో కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా… అన్‌లాక్ కాగానే కరోనా విజృంభించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ సమయంలో కేవలం 73 కేసులు మాత్రమే ఉండేవి. అందరూ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకొని కోలుకున్నారు. కానీ ప్రస్తుతం కొవిడ్ తీవ్రత పెరిగింది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో రెండు జిల్లాల్లో కలిసి మొత్తం 500 కేసులు దాటాయి. ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ సమయంలో 61 కేసులు నమోదయ్యాయి. అన్‌లాక్ తర్వాత ఆ సంఖ్య 300కు చేరువలో ఉంది. ప్రతిరోజూ 15కు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 291 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1845 శాంపిల్స్ సేకరించి పంపగా.. 1757 శాంపిల్స్ ఫలితాలు వచ్చాయి. ఇందులో 291 పాజిటివ్ కేసులుండగా... మరో 75 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. కేవలం గత పదిరోజుల్లోనే 139 కేసులు నమోదయ్యాయంటే వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే మరణాల సంఖ్యా ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజుల్లోనే 12 మంది కరోనా కారణంగా చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 16కు చేరుకుంది. మరణించిన వారిలో నిజామాబాద్ నగర వాసులే అధికంగా ఉన్నారు. అలాగే 50 నుంచి 60 ఏళ్ల వయసున్న వారే మృతుల్లో ఎక్కువ మంది ఉన్నారు.
కోలుకున్న వారికి మళ్లీ కరోనా..
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైరాలజీ ల్యాబ్ ఏర్పాటు చేసి ఐసీఎంఆర్ ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదట రోజుకు పది పరీక్షలు చేయగా.. ప్రస్తుతం ఆ సంఖ్యను 300కు పెంచారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల శాంపిల్స్ ఇక్కడ పరీక్షలు చేసి వ్యాధిని నిర్ధారిస్తున్నారు. రెండు రోజుల నుంచి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 2800 కిట్లు రాగా.. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి ఆస్పత్రులతోపాటు ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ఈ కిట్లను పంపిణీ చేశారు. అత్యవసరంగా పరీక్షలు చేసేందుకు ఈ కిట్లను వినియోగిస్తున్నారు. లేదంటే శాంపిల్స్ సేకరించి నిజామాబాద్‌కు పంపిస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లాలో కరోనా సోకి కోలుకున్న నలుగురు బాధితులు మళ్లీ కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.