తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టణాల నుంచి పల్లెలకు చేరుకుంటున్న కరోనా మహమ్మారి... - corona cases in cities

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ కోరలు చాస్తోంది. పట్టణాల్లో ఉన్న ప్రజలు పల్లెలకు చేరుకుంటుంగా... వారితో పాటే మహమ్మరి సైతం గ్రామాలకు చేరుతోందని పలువులు అభిప్రాయపడుతున్నారు.

corona cases increasing in villages
corona cases increasing in villages

By

Published : Aug 25, 2020, 11:02 AM IST

ప్రారంభంలో పట్టణాలకే పరిమితమైన కరోనా కేసులు నెమ్మదిగా పల్లెల్లో నమోదవుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లోనే పెరుగుతున్నాయి. పది రోజుల పాటు జోరుగా వర్షాలు కురిశాయి.. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వైరస్‌ వ్యాపిస్తుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. స్వీయ నియంత్రణతో పాటు భౌతికదూరం పాటించాలని వైద్యులు చెబుతున్నారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

కారణమేమిటంటే?
* ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల సంఖ్య పెంచాలని నిర్దేశించడంతో పీహెచ్‌సీల వారీగా ర్యాపిడ్‌ టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచారు. దీంతో పల్లెల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.
* పట్టణాల్లో నివసించే ఉద్యోగులతో పాటు పలువురు యువత పల్లెల బాట పట్టారు. పట్టణాల్లో భవన నిర్మాణ పనులతో పాటు ఇతర పనులు కుంటుపడటంతో కూలీలతో పాటు చిరుద్యోగులు కూడా పల్లెల్లోనే నివాసం ఉంటున్నారు. వీరు తరచూ పట్టణాల నుంచి పల్లెలకు రాకపోకలు సాగించడం వల్ల వైరస్‌ వ్యాప్తి పల్లెలకు పాకింది. ముఖ్యంగా పట్టణాలకు సమీప గ్రామాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
బాన్సువాడలో 128 నమూనాల సేకరణ
కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌లో కరోనా వచ్చిన వారి కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టు ఉన్న 128 మంది నుంచి నమూనాలు సేకరించి హైదరాబాద్‌కు పంపించినట్లు ప్రాంతీయ ఆస్పత్రి పర్యవేక్షకుడు శ్రీనివాస్‌ ప్రసాద్‌ తెలిపారు. వాటి ఫలితాలు మంగళవారం వస్తాయన్నారు. కరోనా లక్షణాలు ఉన్న 26 మందికి ర్యాపిడ్‌ కిట్లతో పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. పాతబాన్సువాడ, టీచర్స్‌ కాలనీల్లో రెండు చొప్పున కేసులు నమోదైనట్లు తెలిపారు.

ఒకరి మృతి....
బాన్సువాడ : మండలంలోని తాడ్కోల్‌కు చెందిన ఓ వ్యక్తి(49) కొవిడ్‌తో చికిత్స పొందుతూ నిజామాబాద్‌ ఆస్పత్రిలో సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన భార్యతో పాటు కుమారుడికి పాజిటివ్‌ రావడంతో ప్రస్తుతం అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భర్త మృతి విషయం తెలుసుకొన్న ఆమె కన్నీరు మున్నీరుగా విలపించారు. జిల్లా కేంద్రంలోనే అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. నెల క్రితమే ఆయన కుమార్తె వివాహం చేశారు.
పది రోజుల్లోనే 1304 మందికి
కామారెడ్డి పట్టణం: జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ విజృంభణ ఆగడం లేదు. గడిచిన పది రోజుల్లోనే 1304 మందికి వైరస్‌ సోకింది. జులై నెలాఖరు వరకు 850 పాజిటివ్‌, 773 యాక్టివ్‌ కేసులుండగా 24 రోజుల్లో 2521 మందికి వైరస్‌ సోకింది. ఈ నెలలోనే 74.78 శాతం మంది కొవిడ్‌ వైరస్‌ బారిన పడ్డారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 35 దాటింది.
తేలికగా తీసుకోవద్దు
- చంద్రశేఖర్‌, వైద్యాధికారి, కామారెడ్డి
పల్లెల్లో నివసించే వారు కరోనాను తేలికగా తీసుకోకుండా స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలి. పరీక్షల సంఖ్య పెంచడంతో జిల్లా వ్యాప్తంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పాజిటివ్‌ వచ్చిన వారిని తక్షణమే క్వారంటైన్‌ చేస్తున్నాం. వారి ప్రాథమిక సంక్రమణ దారులను సైతం పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నాం. అనుమానిత లక్షణాలుంటే నిర్భయంగా టెస్టులు చేయించుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details